మావోయిస్టుల చేతిలో దారుణంగా హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల పై నక్సలైట్ల దాడి ఎలా జరిగిందనే విషయం పై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరు తమ మైనింగ్ క్వారీల వద్దకు వెళుతుండగా మావోయిస్టులు దాడి చేసి చంపేశారని తొలుత ప్రచారం జరగగా, ఆ తరువాత వీరు గ్రామదర్శినిలో పాల్గొనేందుకు వెళుతుండగా మావోల దాడి జరిగిందని వార్తలు వచ్చాయి. అయితే అసలు వాస్తవం వేరని వీరిని మావోలే ఒక పథకం ప్రకారం తమవద్దకు రప్పించుకొని ఆ తరువాత వీరిని మట్టుబెట్టారని పోలీసు వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ వ్యూహాన్నే 'బెయిటెడ్ ఆంబుష్' అంటారని వారు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే...
ప్రత్యర్థులను అంతమొందించేందుకు మావోయిస్టులు అనుసరించే ప్రధాన వ్యూహాల్లో 'బెయిటెడ్ ఆంబుష్' ఒకటి...అంటే ఎరవేసి మట్టుపెట్టడం అని దీనికి అర్థం! ఆ 'ఎర' ఏ రూపంలోనైనా ఉండొచ్చు. ఒక చిన్నపాటి సంఘటన, అలజడి సృష్టించి దాని పై ఆరా తీసేందుకు వచ్చిన బలగాలను మట్టుపెట్టే భీకర దాడికి పాల్పడవచ్చు. లేదా, గిరిజనుల ద్వారా తమ సమస్య గురించి అభ్యర్థనలు పంపించి, అక్కడికి వచ్చిన బలగాలను మట్టుపెట్టవచ్చు. లేదా రాజీ పడటం అనే కాన్సెప్ట్ తో చర్చల పేరుతో టార్గెట్ వ్యక్తులనే తమ వద్దకు వచ్చేలా చేసి అక్కడికక్కడే ఫినిష్ చేసేయడం. ఇవీ 'బెయిటెడ్ ఆంబుష్'లో వ్యూహాల్లో ప్రధానమైనవి.
ఇప్పుడు ఈ ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలు బలయింది రాజీ చర్చల పేరిట అమలు చేసిన 'బెయిటెడ్ ఆంబుష్' వ్యూహానికే అనేది పోలీసుల విశ్లేషణ. ఈ 'బెయిటెడ్ ఆంబుష్' వ్యూహాల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్‌కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్ దిట్టగా పోలీసులు చెబుతున్నారు. గత ఏడాది మే 12న బస్తర్‌లో సీఆర్‌పీఎఫ్ బలగాలను బెయిటెడ్ ఆంబుష్ తోనే ఉచ్చులోగి లాగి మట్టుబెట్టారని తేలింది. ఈ ఘటనలో 25 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అరకు ఎమ్మెల్యే కిడారి, సోమలను కూడా నక్సల్స్ 'మాట్లాడుకుందాం' అనే ఎర వేసి మట్టుపెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు.