ఆంధ్రప్రదేశ్ లో పని చేస్తున్న సీనియర్ ఏపీఎస్ అధికారి, అడిషనల్ డీజీ బాలసుబ్రహ్మణ్యం లాంగ్ లీవ్ లో వెళ్ళటం పై, అధికార వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. ఆయన అమెరికా వెళ్లేందుకు, ఏడాదిపైనే సుధీర్ఘంగా సెలవు కావాలని, ప్రభుత్వానికి లేఖ రాసారు. 2020 మార్చి 4 నుంచి వచ్చే 2021 జూలై 31 వరకు అంటే 515 రోజులు లాంగ్ లీవ్ అడిగారు. తాను వ్యక్తిగత పనుల మీద అమెరికా వెళ్లాలని, లీవ్ కావాలని అంటూ ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. దీని ప్రభుత్వం కూడా వెంటనే లాంగ్ లీవ్‌కు అనుమతి ఇచ్చింది. ఈ పరిణామం సచివాలయం అధికార వర్గాల్లో, చర్చకు దారి తీసింది. ఏకంగా ఏడాదన్నర పాటు ఆయన లాంగ్ లీవ్ కావాలని అడగటం, ప్రభుత్వం కూడా వెంటనే ఆ లాంగ్ లీవ్ కు అనుమతి ఇవ్వటం పై, అధికార వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేసాయి. సహజంగా ఎవరైనా, నెలా రెండు నెలలు లీవె తీసుకుంటేనే, దాన్ని లాంగ్ లీవ్ అంటూ ఉంటారు. దానికి కూడా ప్రభుత్వాలు అన్నీ చూసి అనుమతులు ఇస్తాయి. మరి ఇక్కడ మాత్రం, ఏకంగా 515 రోజులు లీవ్ ఇచ్చారు.
ఇక్కడ రెండు విషయాలు స్పష్టం అవుతున్నాయి. ఆయనకు ఇక్కడ పని చెయ్యటం ఇష్టం లేదు, అలాగే ప్రభుత్వానికి పెద్దగా ఆయన పై ఆసక్తి లేదు అనే విషయం, ఈ ఎపిసోడ్ చూస్తే అర్ధం అవుతుంది. చంద్రబాబు హయంలో, అడిషనల్ డీజీ బాలసుబ్రహ్మణ్యం రవాణా శాఖ కమిషనర్‌గా పని చేసారు. అప్పట్లో, తెలుగుదేశం నేతలు ఆయన పై దురుసుగా ప్రవర్తించారని, వార్తలు రావటంతో, చంద్రబాబు ఆ నేతలను మందలించి, బాలసుబ్రహ్మణ్యం దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పమని కోరారు కూడా. అప్పట్లో ఈ సంఘటన ఒక సెన్సేషన్ అయ్యింది. అయితే, చంద్రబాబు సూచన మేరకు, క్షమాపణ చెప్పటంతో, అప్పట్లో ఆ వివాదం ముగిసింది. ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ, వనజాక్షి ఇష్యూ లా చెయ్యాలి అని చూసినా, కుదరలేదు.
ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, రవాణా శాఖ కమిషనర్‌గా పనిచేసిన బాలసుబ్రహ్మణ్యాన్ని, రైల్వే డీజీగా నియమించారు. అయితే, ఎంతో సీనియర్ అయిన నాకు, ఇది ఏ మాత్రం, ప్రాధాన్యం లేని పోస్టు అంటూ, ఆయన అసంతృప్తిలో ఉన్నారని, అందుకే ఆయన లాంగ్ లీవ్ పై, వెళ్తున్నారు అనే సమాచారం, సచివాలయంలో వినిపిస్తుంది. ఆయన అడిగిన వెంటనే, ప్రభుత్వం కూడా లీవ్ ఆమోదించటం, ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మొన్నటి దాక చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా లాంగ్ లీవ్‌లో ఉన్నారు. ఆయన్ను చీఫ్ సెక్రటరీ నుంచి, బాపట్ల ఎన్‌హెచ్‌ఆర్డీఐకి బదిలీ చెయ్యటంతో, ఆయన అసంతృప్తిలో ఉన్నారు. ఇక సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర రావు, సీనియర్ ఐఆర్ఎస్ జాస్తి కృష్ణ కిషోర్ సస్పెన్షన్ వ్యవహారం కూడా తెలిసిందే. మొత్తానికి, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు చుక్కలు కనిపిస్తున్నాయి అననటంలో సందేహం లేదు.