మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి గురువారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు కన్నుమూశారు. వాజ్‌పేయి మృతిపై నందమూరి బాలకృష్ణ విచారం వ్యక్తం చేశారు. మహోన్నతమైన రాజకీయ నేతను కోల్పోయామని ఆయన పేర్కొన్నారు. 22 జూన్, 2000 సంవత్సరంలో, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఓపెనింగ్ కు అటల్ జీ వచ్చిన ఫోటో పోస్ట్ చేసి, సంతాపం ప్రకటించారు బాలయ్య.
‘‘మా 'బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్'ను 22 జూన్, 2000 సంవత్సరంలో మహానుభావుడు వాజ్‌పేయిగారు ప్రారంభించారు. నాన్నగారితో ఆయనకి మంచి అనుబంధం ఉండేది. ఎన్డీయే ప్రభుత్వంతో కలిసి తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా పనిచేసింది. ఆయన మంచి వ్యక్తి, భావుకత పుష్కలంగా ఉన్న కవి కూడా. ప్రధానిగా సేవలందిస్తూ ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొన్న సమర్ధుడు ఆయన. ఆయన విధివిధానాలు పలువురికి పారదర్శకంగా నిలిచాయి. అంతటి మహోన్నత రాజకీయ నాయకుడిని కోల్పోవడం బాధాకరమే కాదు, జాతీయ స్థాయి రాజకీయాలకు తీరని లోటు..’’ అని బాలకృష్ణ తెలిపారు.
మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి రాజకీయప్రస్థానం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. సామాన్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన అసమాన్య స్ధితికి ఎదిగారు. 1924 డిసెంబర్ 25న గ్వాలియర్‌లో వాజ్‌పేయి జన్మించారు. యువకుడిగా ఉన్నప్పుడే రాజకీయాల పట్ల ఆసక్తి చూపారు. పొలిటికల్ సైన్స్‌లో పీజీ పట్టభద్రుడయ్యారు. 1947లో ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో 23 రోజులు జైలు జీవితం గడిపారు. కుంభకోణాలకు తావు లేకుండా ప్రాంతీయ పార్టీల్ని కట్టడి చేసిన రాజనీతిజ్ఞుడు ఆయన. 1999-2004లో ఐదేళ్ల పాటు సంకీర్ణ సర్కార్‌ను నడిపిన అపర చాణక్యుడుగా ఆయన కీర్తింపడ్డారు. కాంగ్రెస్సేతర ప్రధానిగా ఐదేళ్ల పాలన పూర్తి చేసిన ప్రధానిగా రికార్డు కెక్కారు.