రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పేపర్ బ్యాలెట్‌పైనే నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. బ్యాలెట్ పత్రాలతోనే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని, ఈవీఎంలు విశ్వసనీయమైనవి కావని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ విషయమై అన్ని పార్టీలతో కలిసి పోరాడతామని చెప్పారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నానని, బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నానని చంద్రబాబు గుర్తుచేశారు. సోమవారం రాత్రి సచివాలయంలో ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తొలుత పెథాయ్ తుపానును ఎలా ఎదుర్కొన్నామో వివరించిన ముఖ్యమంత్రి చివర్లో విలేకరులు తాజా రాజకీయ పరిస్థితులపై ప్రశ్నల వర్షం కురిపించగా స్పందించారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌ను ప్రపంచంలో ఎవరూ వినియోగించటంలేదని తెలిపారు. అది చిప్ ఆధారిత మిషన్.. దాన్ని సులభంగా ఏ మార్చే అవకాశం ఉంది.. ప్రజాస్వామ్యం కొంత మంది చేతిల్లో కీలుబొమ్మగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎన్నికల కేసు 3, 4 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. ఈవీఎంలో డేటా అన్ని రోజులు ఉంటుందా అని ప్రశ్నించారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం.. ప్రపంచమంతా పేపర్ బ్యాలెట్‌కు వెళుతుంటే మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్‌కు ఎందుకెళ్లాలని నిలదీశారు. టెక్నాలజీ తెలిసిన వ్యక్తిగా ఈవీఎంల గురించి చెబుతున్నా.. ఈ విధానం ఫలితాన్ని తేలిగ్గా తారుమారు చేసేందుకు వీలయ్యేదని తెలిపారు. పేపర్ బ్యాలెట్ వల్ల నష్టం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పేపర్ బ్యాలెట్‌పైనే నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికలను కూడా ఇదే తరహాలో నిర్వహించేందుకు ఉద్యమిస్తామని తెలిపారు.
ఒక్క తెలంగాణలోనే కాదు, ఎన్నికలు ఎక్కడ జరిగినా.. ఈవీఎంల విశ్వసనీయత ప్రశ్నార్థకమేనని అన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ సమస్యలు ఉన్నాయన్నారు. గతంలో తాము పోరాడితేనే వీవీ ప్యాట్‌లు వచ్చాయని చెప్పారు. అవీ సరైన కాంతి లేకుండా చూసుకోవాలని, దాని వల్ల సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈవీఎంలను తయారుచేసినవారు ఆ చిప్‌కు కమాండ్ ఇచ్చి మోసం చేసే ఆస్కారం ఉందన్నారు. ఓట్లు కొనే ఆస్కారం లేకుండా చేసేందుకే తాను రూ.2,000 నోటు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నానని చంద్రబాబు చెప్పారు. భాజపా ప్రభుత్వం ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో గెలిచేందుకు రూ.2,000 నోటు తీసుకువచ్చిందన్నారు. డిజిటల్ కరెన్సీ వల్ల ఓట్ల కొనుగోలు అనేది లేకుండా పోతుందని చెప్పారు.