ప్రజల ఆదరణ ఎలాగూ లేదని జగన్ పార్టీకి అర్ధమైంది, అందుకే రకరకాల కుట్రలతో ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఓటర్లను ఏదో ఒక విధంగా తప్పుదోవ పట్టిస్తూ తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. మైదుకూరులో మీడియా సర్వే అంటూ తెలంగాణకు చెందిన కొంతమంది ఇంటింటికి తిరుగుతూ ప్రలోభాలు పెడుతున్న 13 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన మరువకముందే ఇప్పుడు వైసీపీ వారు ముద్రించిన నమూనా బ్యాలెట్లో టీడీపీ గుర్తు వరుస నెంబరు మార్చి తప్పుగా కొట్టించి ప్రచారంలో ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. ఓటు ఎవరికి వేయాలో ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఎన్నికల కమిషన్ బ్యాలెట్ పత్రంపై అభ్యర్థి వరుస నెంబరుతో పాటు పేరు, పార్టీ, పార్టీ గుర్తును ముద్రిస్తారు.
ఈ నమూనా బ్యాలెట్‌తో ఓటర్లకు అవగాహన కుదిర్చేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు ఫలాన నెంబరుకు లేదా ఫలానా గుర్తు అంటూ పంపిణీ చేయడం అనవాయితీగా మారింది. అయితే మైదుకూరులో వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డికి 4వ నెంబరని, 3వ నెంబరు సైకిల్ గుర్తు అంటూ ఓటర్లను తప్పుదోవ పట్టించేలా నామూనా బ్యాలెట్‌ను ముద్రించారు. వైసీపీ వారు ముద్రించిన నమూనా బ్యాలెట్లో టీడీపీ అభ్యర్థి 3వ నెంబరు అని గ్రహించే అవకాశముందనే కేవలం ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారంటూ టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీని పై ప్రజల్లో అవగహన కలిగించి, వీరి కుట్రల పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
కాగా తెలుగుదేశం పార్టీ తరపున ముద్రించిన నమూనా బ్యాలెట్ సరిగానే ముద్రించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇచ్చిన నమూనా ప్రకారమే 2వ నంబరులో టీడీపీ సైకిల్ గుర్తు, 4వ నంబరులో వైసీపీ ఫ్యాను గుర్తుని ముద్రించిన కరపత్రాలనే ఓటర్లకు పంపిణీ చేసి వారి సద్బుద్ధిని చాటుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు నమూనా బ్యాలెట్‌ను అందచేశామని, ఆ ప్రకారమే నమూనా బ్యాలెట్‌ను ముద్రించి ప్రచారం చేసుకోవాలని, అలా కాకుండా తప్పుగా ముద్రించి పంపిణీ చేయడం సరికాదని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సతీష్ చంద్ర వివరణ ఇచ్చారు. ఈ సంఘటనపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.