బందరు పోర్టు కల త్వరలోనే సాకారం కానుంది. రేపు మచిలీపట్నం పోర్టు పనులు ప్రారంభం కానున్నాయి. . అత్యాధునిక హంగులతో, అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో మచిలీపట్నం పోర్టు రూపుదిద్దుకోనుంది. చెన్నై- విశాఖ పట్నం పోర్టులను మించేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ పోర్టుల నిర్మాణ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా బ్రేక్‌వాటర్ విధానంలో ఈ పోర్టును నిర్మించనున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పలు మధ్య భారత రాష్ట్రాలకు కూడా అతి దగ్గరి ఓడరేవు కావటంతో ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారీ స్థాయిలో ఈ పోర్టు నిర్మాణానికి నిధులు వెచ్చిస్తున్నారు. రోడ్డు, ఇతర మౌలిక సదుపాయాలతో కాకుండానే రూ.11,924కోట్లను ఈ బందరు పోర్టు కోసం ఖర్చుచేయనుండగా.. తొలి దశలో రూ. 6,778 కోట్లను వెచ్చించనున్నారు. నిర్మాణ రంగంలో అందెవేసిన చేయిగా ఉన్న నవయుగ సంస్థ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు సూచనల మేరకు బందరు పోర్టును నిర్మించి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చబోతోంది.
ఎనభై శాతానికిపైగా భూ సేకరణ పూర్తయింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ప్రకారం 5,300 ఎకరాలు అవసరం. ప్రతిపాదిత గ్రామాల పరిధిలో 3వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. భూ సమీకరణ పథకం (ఎల్‌పీఎస్), భూ కొనుగోలు పథకం (ఎల్‌పీఎస్) కింద 1,700 నుంచి 1,800 ఎకరాలను మచిలీపట్నం నగరాభివృద్ధి సంస్థ (ముడా) రైతుల నుంచి సేకరించింది. మిగతా భూమిని కూడా సమీకరిస్తోంది. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఇప్పటికే రూ.200 కోట్ల ఆర్థిక సాయాన్ని ముడాకు అందించింది. మరో 1,350 కోట్లను ప్రభుత్వ హామీపై ఇచ్చేందుకు పలు బ్యాంకులు ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలో పోర్టు పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు నవయుగ ఇంజినీరింగ్ సంస్థ సిద్ధమైంది. డ్రెడ్జింగ్ యంత్రాలు కూడా చేరుకున్నాయి. గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
రూ. 11,924 కోట్లతో నిర్మాణం... మచిలీపట్నం పోర్టును రెండు దశల్లో అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ రెండు ఫేజ్‌లకు కలిపి మొత్తం రూ.11,924 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు రూపొందించారు. మొదటి దశలో రూ.6,778 కోట్లు కాగా, రెండవ దశలో రూ.5146 కోట్లను వెచ్చించనున్నారు. మొదటి దశలో ప్రాజెక్టు ప్రిలిమ్‌నరీస్ అండ్ సైట్‌కు రూ.57 కోట్లు, డ్రెడ్జింగ్‌కు రూ. 1564కోట్లు, బ్రేక్‌వాటర్‌కు రూ.817 కోట్లు, బెర్తులకు రూ.1674 కోట్లు, స్టాక్‌యార్డ్ అభివృద్ధికి రూ.275 కోట్లు, యంత్ర పరికరాలకు రూ.151 కోట్లు, విద్యుదీకరణకు, పరికరాలకు రూ.87 కోట్లు, అంతర్గత రహదారులు, రైల్వే లైన్లకు రూ.172 కోట్లు, బాహ్య రైల్వే లైన్‌కు రూ.30 కోట్లు, ఇతర ఖర్చులకు రూ.237కోట్లు, సర్వీస్ ట్యాక్స్ (5.60శాతం)కు రూ.354 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.