రాష్ట్ర ప్రజలకు షాకులు ఇవ్వటం ప్రభుత్వానికి అయిపోయినట్టు ఉంది. ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం లాంటి ప్రాజెక్ట్ ల విషయంలో, ప్రభుత్వ వైఖరితో, ఈ రెండు ప్రాజెక్ట్ లు అవ్వవు అనే అభిప్రాయానికి రాష్ట్ర ప్రజలు వచ్చారు. అమరావతి అయితే, ఇప్పుడే అవసరం లేదని ప్రభుత్వం చెప్పేసింది కూడా. ఇక పోలవరం మళ్ళీ టెండర్ అంటూ చేస్తున్న హడావిడితో, ఇక పోలవరం ఇప్పుడే అయ్యే పని లేదు. ఇవి ఇలా ఉంటే, ఇప్పుడు రాష్ట్ర స్థాయి వదిలి, జిల్లాల స్థాయిలో అమలు అవుతున్న పెద్ద ప్రాజెక్ట్ ల పై జగన్ ప్రభుత్వానికి కన్ను పడింది. ఈ నేపధ్యంలోనే నిన్న రాత్రి వచ్చిన ఉత్తర్వులు చూసి, కృష్ణా జిల్లా వాసులు నిరాశలోకి వెళ్ళిపోయారు. కొన్ని దశాబ్దలుగా బందర్ పోర్ట్ కోసం, కృష్ణా జిల్లా ప్రజలు పోరాటాలు చేస్తున్నారు.
ఎన్నో ఏళ్ళ నుంచి పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు మాత్రం ముందడుకు వెయ్యలేదు. అయితే మొన్న చంద్రబాబు ప్రభుత్వంలో, ఈ కల సాకారం అయ్యింది. భూసేకరణ చేసి, టెండర్లు పిలిచి, నవయుగ కంపెనీకి పనులు ఇచ్చి, పనులు ప్రారంభించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారటంతో మొత్తం తారు మారు అయ్యింది. అయితే ప్రభుత్వం మారినా, పోర్ట్ నిర్మాణ పనులు ఆపరులే అని ప్రజలు అనుకున్నారు. కాని అనూహ్యంగా, బందరు పోర్టు నిర్మాణం కోసం నవయుగ సంస్థ ‘లీడ్ ప్రమోటర్’గా మచిలీపట్నం పోర్టు లిమిటెడ్ తో కుదుర్చుకున్న ఒప్పందాన్నినిన్న రాత్రి ప్రభుత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కృష్ణా జిల్లా ప్రజలు షాక్ అయ్యారు. ఎన్నో ఏళ్ళ తరువాత పనులు మొదలయ్యాయి అనే సంతోషం వారికి కొన్ని నెలలు మాత్రమే ఉంది.
చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో కష్టాలు పడి, ప్రజలను ఒప్పించి భూమి సమీకరణ చేసారు. 2017 మార్చి నెలలో 3010 ఎకరాలప్రభుత్వ భూమిని సమీకరించి కాకినాడ పోర్టు డైరెక్టర్‌కు అప్పగించారు. తరువాత, మరింత భూమి కోసం, 2016లో మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి, ముడా ఆధ్వర్యంలో భూసమీకరణ, సేకరణ ప్రక్రియ చేపట్టారు. పోర్టుకు అవసరమైన ప్రైవేటు భూమిని పోర్టు నిర్మాణం జరిగే ప్రాంతంలో ఎకరం 25 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. నవయుగ పెద్ద పెద్ద మిషనరీ అంతా తీసుకువచ్చి పనులు మొదలు పెట్టింది. అయితే ఎన్నికల ఫలితాలు రావటంతోనే, మొత్తం రివర్స్ అయ్యింది. పనులు నేమ్మదించాయి. ఇప్పుడు ఏకంగా, ఒప్పందమే రద్దు అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండర్ కు వెళ్తాం అంటున్నారు. ఇది ఎప్పటికి అయ్యేనో, ప్రజల కల ఎప్పటికి ఫలించేనో..