అనంతపురం జిల్లాలో మరో కొత్త అభ్యర్థిని టీడీపీ తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటికే పరిటాల శ్రీరామ్, జేసీ పవన్, జేసీ అశ్మిత్ రెడ్డి.. వంటి యువ నేతలు తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. వారితోపాటు బండారు శ్రావణి అనే యువ నాయకురాలు కూడా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎంపీ జేసీ అండదండలతో ఆమెకు శింగనమల టికెట్‌ను చంద్రబాబు ఖరారు చేశారు. మొదటి విడతలోనే మెజారిటీ సీట్లకు టికెట్లను కేటాయించిన చంద్రబాబు.. కొన్ని స్థానాలను మాత్రం పెండింగ్‌లో పెట్టారు. వాటిల్లో ఎస్సీ రిజర్వ్‌డ్ అయిన శింగనమల నియోజకవర్గం కూడా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే యామిని బాలపై కొంత వ్యతిరేకత ఉంది. ఆ నియోజకవర్గంలో సర్వే ఫలితాలు ఆమెకు అనుకూలంగా రాలేదు.

radha 19032019

ఆమెకు టికెట్ ప్రత్యామ్నాయం చూపిస్తూనే బలమైన అభ్యర్థి కోసం చంద్రబాబు తీవ్ర కసరత్తు చేశారు. ఇదే అదనుగా భావించిన జేసీ.. శింగనమల సీటును బండారు శ్రావణికి కేటాయించాలని చంద్రబాబుపై ఒత్తడి తెచ్చారు. దీంతో మరోసారి ఆమె పేరుతో శింగనమలలో చంద్రబాబు ఐవీఆర్ఎస్ సర్వే చేశారు. సర్వే ఫలితాలను బేరీజు వేసుకున్న తర్వాత.. తుది నిర్ణయాన్ని సోమవారం ప్రకటించారు. ఎంపీ జేసీ అభిప్రాయానికి చంద్రబాబు ఓకే చెప్పారు. బండారు శ్రావణికి శింగనమల టికెట్‌ను ఖరారు చేశారు. శింగనమలలో టీడీపీ సీనియర్ నాయకుడు బండారు రవికుమార్ కుమార్తె.. బండారు శ్రావణి. గత ఎన్నికల్లో బండారు రవికుమార్‌కు టికెట్ కేటాయించారు. నామినేషన్ వేసేందుకు పార్టీ బీఫాం కూడా ఇచ్చారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నామినేషన్ వేయలేకపోయారు. దీంతో ఆఖరు నిమిషంలో యామినిబాలకు టికెట్ దక్కింది. దీంతో ఆమె గెలుపు కోసం రవికుమార్ తీవ్ర కృషి చేశారు. అనంతరం బండారు చారిటబుల్ ట్రస్ట్‌‌ను ప్రారంభించి సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. వ్యూహాత్మకంగా తన కుమార్తె బండారు శ్రావణిని రాజకీయ తెరపైకి తెచ్చారు. ఆమె కూడా పార్టీ కార్యక్రమాల్లోనూ, సేవా కార్యక్రమాల్లోనూ ఎప్పుడూ ముందుంటూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ వచ్చారు.

radha 19032019

జేసీ దివాకర్ రెడ్డి అండదండలు కూడా ఉండటం ఆమెకు కలిసొచ్చింది. యామినిబాలపై వ్యతిరేకత ఉందన్న అంశం తెరపైకి రావడంతో.. జేసీ చకచకా పావులు కదిపారు. బండారు శ్రావణిని చంద్రబాబు వద్దకు నేరుగా తీసుకెళ్లారు. ‘శింగనమల టికెట్‌ను శ్రావణికి ఇవ్వండి.. గెలిపించే బాధ్యత నాదీ..’ అని చంద్రబాబును కోరారు. అనంతపురం ఎంపీ పరిథిలోనే శింగనమల ఉండటంతో.. ఆయన మాటను చంద్రబాబు పరిగణనలోకి తీసుకున్నారు. ఐవీఆర్ఎస్ సర్వే చేసి రిపోర్టును తెప్పించుకున్నారు. మొత్తానికి బండారు శ్రావణికే టికెట్ కేటాయిస్తున్నట్లు సోమవారం చంద్రబాబు ప్రకటించారు. గత ఎన్నికల్లో తన తండ్రికి టికెట్ వచ్చినా.. అనుకోని పరిస్థితుల్లో నామినేషన్ వేయలేకపోయామనీ, ఇప్పడు తనకు అవకాశం రావడం ఆనందంగా ఉందని బండారు శ్రావణి హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తన తండ్రి రవికుమార్ చేయాలనుకున్న అభివృద్ధిని తాను చేసి చూపిస్తానంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read