ఇక నుంచి రైతులు తమకు అవసరమైన రుణాల కోసం రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయనక్కర్లేదు. క్షణాల్లో రుణాలే రైతు ఇంటికి వెళ్తాయి. అటువంటి అత్యాధునిక సాంకేతిక విజ్ఞానంతో కూడిన ‘మొబైల్ ఏటీఎం’ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని ప్రతి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)ల ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిఒక్క జిల్లాలోను నిర్వహిస్తారు. ఈ వాహనాలు జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్)లు, డీసీసీబీ బ్రాంచీల పరిధిలో పనిచేస్తాయి. ఇవి మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో రైతుల వద్దకు వెళ్తాయి. డీసీసీబీ పరిధిలో నడుస్తున్న సొసైటీల్లో ఉన్న రైతు సభ్యులకు కల్పించిన రూపే కార్డులను ఈ మొబైల్ ఏటీఎంల ద్వారా ఉపయోగించుకుని తగిన రుణాన్ని పొందవచ్చు.

farmer 18082018 2

ఏపీలో ప్రతి జిల్లాలోను ఈ విధమైన మొబైల్ ఏటీఎంలను ప్రభుత్వం ప్రవేశపెట్టగా వీటికి నాబార్డు ఆర్థిక సహాయాన్ని అందించింది. ఒక్కో మొబైల్ ఏటీఎం వాహనానికి రూ.15లక్షలు మేర ఖర్చు చేసింది. ప్రత్యేక వాహనంలో ఏటిఎం యంత్రాలను అమర్చింది. దీనిలో సహకార రంగానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను నింపింది. ఈ విధంగా నిర్వహించే మొబైల్ ఏటిఎం వాహనం నేరుగా రైతుల ఇళ్ళ వద్దకే వెళ్తుండం ద్వారా రైతు సభ్యులు వద్ద ఉండే రూపే కార్డులను ఉపయోగించుకుని అవసరమైన రుణాలను పొందే సౌలభ్యం కలుగుతుంది. ఏపీ మొత్తం మీద 30 లక్షలకు పైగానే రైతుసభ్యులు ఉండగా, ఒక్క విశాఖ జిల్లాకు సంబందించి 96 సొసైటీల పరిధిలో 2.7లక్షల మంది కలిగి ఉన్నారు. వీరిలో 40నుంచి 60 శాతం ప్రతి ఏడాది పంట రుణాలు పొందుతుంటారు. ఇందులో దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు పొందే అవకాశం కల్పించబడింది. రైతు పండించే పంటలు, కలిగి ఉన్న వ్యవసాయక్షేత్రాన్నిబట్టి రుణాన్ని మంజూరు చేయడం జరుగుతుంది. ఈ విధంగా కనీసం లక్ష నుంచి ఎంతైనా తీసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది.

farmer 18082018 3

ప్రధానంగా వరి, చెరకుతోపాటు పలు రకాలైన ఆదాయాన్ని తెచ్చిపెట్టే పంటల వేసుకునేందుకు, ఎరువులు, ట్రాక్టర్ల కొనుగోలు కోసం బ్యాంకు యాజమాన్యం ప్రతి ఏడాది రుణాలను మంజూరు చేస్తుంది. ఇలా.. మంజూరయ్యే రుణాల కోసం రైతులు జిల్లా నలుమూలల నుంచి నగరంలో ఉన్న ప్రధాన కార్యాలయానికి, లేదంటే సమీపంలో ఉండే బ్యాంకు శాఖల వద్దకు రావాల్సి ఉంటుంది. అనేకసార్లు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ సిఫారసులు చేసుకున్నా రుణం కోసం సమయం పట్టే పరిస్థితులు ఉంటున్నాయి. దీనివల్ల సమయం, డబ్బు వెచ్చించాల్సి వస్తోందని జిల్లాలో పలు మండలాలకు చెందిన రైతుల ఫిర్యాదులను దృష్టిలోపెట్టుకుని అన్నదాత సంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకున్న ప్రభుత్వం ఎట్టకేలకు సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి మొబైల్ ఏటీఎం వాహనాన్ని ట్రయిల్ రన్‌గా నిర్వహించి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఏపీలో విశాఖ జిల్లా డీసీసీబీ పరిధిలో దీనిని అధికారికంగా ప్రారంభించి మరో నాలుగు రోజుల్లో రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహాణాధికారి డివికె వర్మ శుక్రవారం ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. దీనిపై బ్యాంకు సిబ్బంది రైతులకు అవగాహన కల్పిస్తారని, ఏటీఎం వినియోగంపై కొన్నాళ్ళపాటు సహకరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read