తెలుగుదేశం నాయకుడు, మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడి పై, మంత్రి కొడాలి నాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సంగతి తెలిసిందే. దీని పై,బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పందిస్తూ, మంత్రి కొడాలి నానికి అల్టిమేటం ఇచ్చారు. ఇది వరు రాసిన బహిరంగ లేఖ... "బలహీనవర్గాల జాతీయ నాయకుడు, మాజీ ఆర్థికమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, ఉత్తమ పొలిటీషియన్ అవార్డు గ్రహీత శ్రీ యనమల రామకృష్ణుడుగారిని బ్రోకర్ అంటూ మంత్రి కొడాలి నాని చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆర్థిక మంత్రిగా ఎన్నో సంస్కరణలకు నాంది పలికి రాష్ట్ర ప్రగతికి బంగారు బాటలు వేసినటువంటి యనమల రామకృష్ణుడుగారిని కించపరచడం బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. బీసీల ముద్దుబిడ్డ యనమల రామకృష్ణుడు. బలహీనవర్గాలపై జరుగుతున్న దాడిపై,చేసిన విమర్శలపై ఇంతవరకు ముఖ్యమంత్రి స్పందించకపోవడం గర్హనీయం."
"మూడు రోజుల్లో మంత్రి కొడాలి నాని బహిరంగ క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకపోతే నేషనల్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నేతల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. బలహీనవర్గాలంటే వైకాపా నేతలకు అంత చులకనా? మేం రాజకీయంగా ఎదగడం మీకు ఇష్టం లేదా? బలహీనవర్గాలపై జరుగుతున్న దాడులపై కూడా ప్రభుత్వం శీతకన్ను వేసింది. అగ్రవర్ణాలకు పెత్తనం కట్టబెడుతూ బీసీలను అణిచివేసేందుకు కుట్ర చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకే వైసీపీ నేతలు యనమల రామకృష్ణుడుపై నోరుపారేసుకుంటున్నారు." అంటూ వై. నాగేశ్వరరావు యాదవ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు.
ఇక మరో పక్క, మాజీ మంత్రివర్యులు, అమర్‌నాథ్ రెడ్డి, కొడాలి నాని తిరుమల గుడి పై చేసిన వివాదస్పద వ్యాఖ్యల పై స్పందించారు. "తిరుమల తిరుపతి దేవస్థానం గురించి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి కొడాలి నాని మాటలు అత్యంత అవమానకరం. కోట్లాది మంది ప్రజలు ఆరాధించే ఆ దేవదేవుడి విషయంలో ''తిరుమల దేవస్థానాన్ని నీ.. అ.. మొ.. కట్టించాడా.? జగన్మోహన్ రెడ్డి దర్శనానికి వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు.'' అంటూ హిందువుల మనోభావాలను కించపరిచినా.. ఇంత వరకు టీటీడీ బోర్డు ఛైర్మన్ ఎందుకు స్పందించ లేదు.? తిరుమల తిరుపతి దేవస్థానం ఆచార సాంప్రదాయాలు, హిందూ భక్తుల మనోభావాలను హేళన చేసేలా మాట్లాడితే స్పందించాల్సిన టీటీడీ బోర్డు ఉత్సవ విగ్రహంలా ఎందుకు వ్యవహరిస్తోంది. సభ్య సమాజం సిగ్గుపడేలా కలియుగ దైవాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడడం సరికాదు. గతంలో పింక్ డైమండ్, శ్రీవారి నగలు విషయంలో రకరకాల ఆరోపణలు చేశారు. వెయ్యి కాళ్ల మండపం తవ్వేశారంటూ తిరుమల విశిష్టతకు మచ్చతెచ్చారు. ఇప్పుడు ఏకంగా శ్రీవారి ఆలయం గురించే తప్పుగా మాట్లాడడం బాధాకరం." అని అమర్‌నాథ్ రెడ్డి అన్నారు.