ఈడీ అటాచ్ చేసిన రూ.150 కోట్లను రూ.30 కోట్లు బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చి తీసుకున్నారనే అంశం కలకలం రేపుతోంది. భారతీ సిమెంట్స్ ఆస్తుల అటాచ్‌మెంట్ వ్యవహారంపై సుప్రీం కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం అఫిడవిట్ దాఖలు చేయాలని భారతీ సిమెంట్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాతే తదుపరి విచారణ చేపడతామని తేల్చి చెప్పింది. భారతీ సిమెంట్స్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ ``బ్యాంకు గ్యారెంటీ తీసుకొని ఆస్తులు, ఎఫ్‌డీలను విడుదల చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. బ్యాంకు హామీ తీసుకున్న తర్వాత కూడా రూ. 150 కోట్ల విలువైన ఎఫ్‌డీలను ఈడీ జప్తు చేసుకుందని కోర్టుకు వివరించారు. ఈడీ తరఫున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ ఎఫ్‌డీలను జప్తు చేసుకోలేదని కోర్టుకు తెలిపారు. ఎఫ్‌డీలను జప్తు చేశారో? లేదో? అన్న వివరాలతో వారం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని భారతీ సిమెంట్స్‌ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ అఫిడవిట్‌ను తాము కూడా పరిశీలించి తగిన సమాధానం ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని ఈడీ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. దీనికి సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. ప్రతివాదిగా ఉన్న భారతీ సిమెంట్స్ అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాతే తదుపరి విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.
భారతి సిమెంట్స్ పై, సుప్రీం కోర్ట్ లో, ఈడీ సంచలన వ్యాఖ్యలు...
Advertisements