ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైమానిక స్థావరాలు ఏర్పాటుకు, భారత వాయుసేన సిద్ధమైంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఇవి రానున్నాయి. అయితే, వీటి ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తుందా లేదా అనేది చూడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో,ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతంలో భారీ హెలికాప్టర్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అనంతపురం జిల్లాలో డ్రోన్ల తయారీ కేంద్రాన్ని, అమరావతిలో సైబర్ సెక్యూరిటీ కేంద్రాన్ని నెలకొల్పాలని ఆలోచిస్తోంది. వీటికి సంబంధించిన ప్రణాళికలను రాష్ట్రప్రభుత్వానికి సమర్పించింది. అదేవిధంగా రాజమహేంద్రవరం, విజయవాడ విమానాశ్రయాలను యుద్ధవిమానాలు, ఇతర విమానాల మోహరింపు స్థావరంగా వినియోగించుకోవడానికి ప్రతిపాదించింది.
తూర్పు తీర ప్రాంతంలో నిఘా వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్రస్తుతం వినియోగంలో ఉన్న రాజమహేంద్రవరం, విజయవాడల్లోని విమానాశ్రయాలను స్థావరాలుగా వినియోగించుకోవాలని ఐఏఎఫ్ భావిస్తోంది. ప్రస్తుతం చెన్నై సమీపంలోని అరక్కోణంలో వైమానికదళ స్థావరం ఉంది. నౌకాదళానికి విశాఖపట్నంలో ఐఎన్‌ఎస్ డేగ కేంద్రం ఉంది. తూర్పు తీర ప్రాంతానికి వ్యూహాత్మక ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలోనూ, ఈ ప్రాంతంలో చైనా వేగంగా విస్తరిస్తున్న సందర్భంగానూ ఐఏఎఫ్ కూడా ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ను వ్యూహాత్మక కేంద్రాల స్థావరంగా మలచుకోవాలని భావిస్తోంది.
అంతేకాకుండా ప్రకృతి విపత్తులు వంటివి సంభవించిన సందర్భాల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు వినియోగించే హెలికాప్టర్లు, విమానాలను ఈ స్థావరాల్లో మోహరిస్తారు. ఈ ప్రాజెక్టుల విషయమై ఐఏఎఫ్ ఉన్నతాధికారులు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఇప్పటికే మూడు దఫాలు చర్చలు జరిపారు. గత వారం ఐఏఎఫ్ దక్షిణాది కమాండ్ చీఫ్ ఎయిర్ మార్షల్ బి.సురేష్, ఆయన బృందం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాయుసేన స్థావరాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించారు. ఈ ప్రతిపాదనలపై ఐఏఎఫ్‌తో సమన్వయం చేసుకోవాలంటూ మౌలికసదుపాయాలు, పెట్టుబడుల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్‌ను సీఎం ఆదేశించారు.