భవానీ ద్వీపానికి కొత్త హంగులు అద్దెందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. రాజధానిలో కీలక ప్రాంతం కావడంతో అభివృద్ధి పై భవానీ ద్వీపం టూరిజం కార్పొరేషన్ (బీఐటీసీ) దృష్టి సారించింది. ఇందులో భాగంగా రూ.16 కోట్లతో ప్లోటింగ్ మ్యూజికల్ లేజర్ ఫాంటేన్లను డిసెంబర్ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ద్వీపానికి వచ్చిన వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉల్లాసంగా గడిపేందుకు కొత్త కొత్త ప్రాజెక్టులు కొత్త సంవత్సరంలో ఏర్పాటు చేయనున్నారు. మాస్టర్ ప్లాన్ లో ఉన్న విధంగా పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఈ కొత్త ప్రాజెక్టులు తయారు చేయాలని బీఐటీసీ అధికారులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది చేపట్టబోయే కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు ఇలా ఉన్నాయి.
కృష్ణానదిలో ఏడు ద్వీపాలు ఉన్నప్పటికీ తొలుత 133 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భవానీ ద్వీపం పై అధికారులు దృష్టి సారించారు. ఇక్కడికే పర్యాటకులు ఎక్కువగా వస్తుండడంతో సరికొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా మజ్ గార్డెను ఏర్పాటు చేయనున్నారు. ఈ మజ్ గార్డెన్ లోకి ఒక మార్గంలోంచి లోపలకు వెళ్లి తిరిగి బయటకు రావడానికి తికమకపడాల్సిందే. నాలుగు వైపుల నుంచి బయటకు వెళ్లేందుకు వీలుండటం, ఏ మార్గంలో వెళ్తున్నామో తెలియకపోవడంతో ఇందులోకి వెళ్లిన వారికి మజ్ గార్డెన్పై ఉత్సాహం కలిగిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇదే కాకుండా మిర్రర్ మజ్ ను ద్వీపంలో ఏర్పాటు చేస్తు న్నారు. ఈ మిర్రర్ మజ్ ఒక రకమైన మయసభ. అనేక అద్దాలు ఉండటంతో ఎక్కడైనా ఒక చోట నిలబడి చూస్తే అన్ని అద్దాల్లోనూ వారి ప్రతిబింబమే కనపడుతుంది. దీంతో అసలు వ్యక్తి ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం కొద్దిగా కష్టమే అవుతుంది.
గోల్ఫ్ సిమ్యులేటర్... గోల్ఫ్ ఆట పై ఆసక్తి ఉన్నవారు ఈ ఆటను నేర్చుకునేందుకు గోల్ఫ్ సిమ్యూలేటర్ను ఏర్పాటు చేయనున్నారు. సిమ్యూలేటర్లో ఆడితే గోల్ఫ్ కోర్ట్ లో ఆడినట్లుగానే అనుభూతి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనితో పాటు అత్యాధునిక సౌకర్యా లతో కూడిన రెస్టారెంట్ను ద్వీపంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆరోగ్యం కోసం ట్రాక్స్... ద్వీపానికి వచ్చే పర్యాటకులు ఉల్లాసంగా గడపటంతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు వాకింగ్, సైక్లింగ్ ట్రాక్స్ ను ఏర్పాటు చేస్తారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఇప్పటికే వాకింగ్ చేసుకునే వీలుంది. దీనికి తోడు ఆధునిక వాకింగ్ ట్రాక్ను, సైక్లింగ్ ట్రాక్ను ఏర్పాటు చేస్తారు. ఆసక్తి ఉన్న వారు ద్వీపంలో ఒకటి రెండు రోజులు ఉన్నా ఈ ట్రాక్స్ ను ఉపయోగించుకుంటారు.