సీమ ద్రోహి ఎవరు? కేసీఆర్‌కు దాసోహం.. సీమకు జలద్రోహం.. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రాంతాల మధ్య చిచ్చు.. భూమా అఖిల ప్రియ... "ఈ ఏడాది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి కృష్ణా నదిలో దాదాపు 750 టీఎంసీలు నీరు సముద్రంలో కలిసిపోయింది. 8సార్లు శ్రీశైలం గేట్లు ఎత్తినా రాయలసీమకు నీటి కేటాయింపుల్లో వైఫల్యం చెందింది. సీమలో మొత్తం 11,048 చెరువుల్లో 79.33 టీఎంసీల నీటి సామర్ధ్యం ఉంటే కేవలం 17.22 టీఎంసీల నీటిని అందించడం జగన్మోహన్‌రెడ్డి పాలనా వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. అనంతపురంలో 1,459 చెరువులు ఉంటే కేవలం 50 చెరువులు మాత్రమే నింపడం జగన్ అసమర్ధ పాలనకు నిదర్శనం. జిల్లాలో మొత్తం 11 జలాశయాల పూర్తి నిల్వ సామర్ధ్యం 37.7 టీఎంసీలు అయితే కేవలం 18.88 టీఎంసీలే నిల్వ ఉంచారంటే ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతుంది. అంతే కాకుండా చంద్రబాబు నాయుడు గారి పాలనలో కేసీ కెనాల్ ద్వారా 3.60 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించారు. కాని జగన్మోహన్‌రెడ్డి మాత్రం కేసీఆర్‌కు భయపడి శ్రీశైలంలో 871 అడుగుల నీట మట్టం నేడున్నా నీరు వదల్లేదు. దీని వల్ల సాగు భూములకు నీటి కొరత ఏర్పడింది. పంట దెబ్బ తినే స్థితి ఏర్పడింది. శ్రీశైలంలో 854 అడుగుల వరకు నీరు విడుదల చేయవచ్చు. ఇప్పటి వరకు కేసీఆర్ కెనాల్ ద్వారా జగన్ ప్రభుత్వం కేవలం 2.30 లక్షల ఎకరాలకు మాత్రమే అందించడం సీమ ప్రజలకు చేస్తున్న అన్యాయం కాదా? గుండ్రేలకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 3వేల కోట్లతో సాంక్షన్ ఇస్తే ఈ ప్రభుత్వం కక్షపూరితంగా క్యాన్సిల్ చేశారు."
"గుండ్రేవుల పూర్తి అయితే కేసీకెనాల్ ఆయకట్టు సస్యశ్యామలం అయ్యి ఉండేది. ప్రస్తుతం రాయలసీమ పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే వచ్చే వేసవి కాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ఇప్పటి వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. జగన్ పుణ్యమా అని తాగు నీరు దొరకక సీమ ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటారేమో అన్న ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నారు. రాయలసీమ ప్రాజెక్టుల పూర్తిగా దాదాపు రూ.26 వేల కోట్లు అవసరం అవుతాయని ముఖ్యమంత్రి జలవనరుల సమీక్షలో నిర్ధారించారు. అయితే ఇంత వరకు ఒక్క రూపాయి కూడా ప్రాజెక్టులకు ఖర్చు చేయలేకపోవడం, గత ప్రభుత్వ హయాంలో జరుగుతున్న పనులను కక్షపూరితంగా ఆపేయడం జగన్మోహన్‌రెడ్డి రాయలసీమ ద్రోహిగా నిలబెడుతుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి పులివెందులకు నీరందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అంతే కాకుండా రూ.700 కోట్లు గండికోట రైతులకు అందించారు. చత్రావతి రిజర్వాయర్ రైతులకు రూ.50 కోట్లు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాయలసీమకు దాదాపు 150 టీఎంసీలు అందించారు. రాయలసీమలో ఉన్న రిజర్వాయర్లు అన్ని కూడా నింపడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది."
"జగన్మోహన్‌రెడ్డి ధౌర్జన్యానికి కియా అనుబంధ పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లాయి. కడప స్టీల్ ప్లాంట్‌కు టిడిపి ప్రభుత్వం రూ.2వేల కోట్లు కేటాయించి ప్రారంభోత్సవం చేసింది. జగన్ ప్రభుత్వం ఈ స్టీల్ ఫ్యాక్టరీకి ఎందుకు మరో 2వేల కోట్లు కేటాయించలేదు. ఓర్వకల్లు విమానాశ్రయం మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం కనీసం విమానాలు నడపలేకపోయింది. మా ప్రభుత్వం సౌర, పవన, విద్యుత్ ప్లాంటులు నిర్మించి 13వేల మందికి ఉద్యోగాలు కల్పించింది. ఈ ప్రభుత్వం ఈ పరిశ్రమల విద్యుత్ ప్యానళ్లు ద్వంసం చేసింది. పెట్టుబడులు రాకుండా అడ్డుకున్నది. కాళహస్తి వద్ద ఎన్.టి.పి.సీ బెల్ పరిశ్రమ తరలిపోతుంటే ఆపే కృషి ఏమి చేశారు? రేణిగుంట వద్ద రిలయన్స్ ఎలక్ట్రానిక్ పరిశ్రమ తరలిపోయే విధంగా చేశారు. ఈ వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరలించడానికి ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. తమ పరిధిలో లేని హైకోర్టు తరలింపును కర్నూలుకు ఇస్తామని ప్రజల్ని మోసం చేస్తున్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలుకు రాజధాని ఇవ్వకుండా ద్రోహం చేస్తున్నారు. ఉంటే రాజధాని అమరావతిలో ఉండాలి. తరలించదలచుకుంటే శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలుకు ఇవ్వాలి."