‘మీకు నేనున్నా. సారు చాలా బిజీగా ఉన్నారు. మీ అవసరాలు, ఏమిటో చెప్పండి. ఐ విల్ ట్రై మై బెస్ట్’.... కుప్పం తెలుగు తమ్ముళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఇచ్చిన భరోసా ఇది. ఎన్నికల రణ క్షేత్రంలో చంద్రబాబు, జిల్లాల వారీగా ప్రచారం చేసుకుపోతున్న విషయం తెలిసిందే. రోజురోజుకూ మారిపోతున్న రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ప్రచార వ్యూహాలు రచించి ప్రత్యర్థులకంటే వేగంగా దూసుకుపోవాల్సిన అవసరం ఆయనకుంది. దీంతో ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారేమోనన్న అనుమానం ఆయన సతీమణి నారా భువనేశ్వరిని వేధిస్తూనే ఉంది. అందుకనే.. కుప్పం నియోజకవర్గంలోని సమన్వయ కమిటీ సభ్యులతో గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆమె అమరావతి నుంచి టెలికాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. సుమారు 15 నిమిషాల సేపు సాగిన కాన్ఫరెన్సులో ఆమె, చంద్రబాబునాయుడు బిజీగా ఉన్నందువల్లే తాను మాట్లాడుతున్నానని చెప్పారు.
సమన్వయ కమిటీ సభ్యులందరూ ఒకరితో ఒకరు కలిసి పనిచేయాలని కోరారు. విభేదాలు పక్కన పెట్టి చంద్రబాబుకు అత్యధిక మెజారిటీ సాధించాలన్నారు. ‘మనం అమలు చేస్తున్న పథకాలు ఇంకా కొంచెం గ్రామాల్లోకి వెళ్లాలన్నది నా ఉద్దేశమం’టూ సున్నితంగా హెచ్చరించారు. ఇంతలో టీడీపీ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జి, రెస్కో ఛైర్మన్ పీఎస్.మునిరత్నం లైన్లోకి వచ్చారు. పార్టీలో అందరినీ సమన్వయ పరుచుకుని వెళ్తున్నామన్నారు. చంద్రబాబు అమలుచేస్తున్న పథకాల పట్ల మహిళలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని, వారిలో మంచి స్పందన కనిపిస్తున్నదని చెప్పారు. కంగుంది పక్క గ్రామంలో ఒక మహిళ, వైసీపీ ర్యాలీకి వెళ్లారన్న కారణంతో తన భర్త, కుమారుని ఇంట్లోకి రానివ్వలేదని, ఇది దృష్టాంతమని పేర్కొన్నారు. భువనేశ్వరి మాట్లాడుతూ ‘నేను సారును అడిగాను. మీరు కుప్పాన్ని పట్టించుకోవడం లేదు.
అక్కడ పార్టీ కార్యకర్తలు, నాయకులు నిరాశ పడతారేమోనని చెప్పాను’ అన్నారు. అయితే కుప్పాన్ని గురించి భయపడాల్సిన అవసరమేమీ లేదని, అక్కడ తానున్నా, లేకున్నా పార్టీ తమ్ముళ్లు బాగా పనిచేస్తారని చంద్రబాబు నమ్మకంగా తనతో చెప్పారని భువనేశ్వరి తెలిపారు. ‘బాగా పనిచేయండి. అందరూ కలిసి సారును అధిక మెజారిటీతో గెలిపించండి’ అని పిలుపునిచ్చారు. కుప్పంతో తనకు అంతగా సంబంధం లేకపోవడం, ఇక్కడకు తరచుగా రాకపోవడం అంత బాగా అనిపించడం లేదన్నారు. ‘ఈసారి ఏవైనా జాతర్లు, ఫంక్షన్లు ఉంటే పిలవండి. తప్పకుండా వొస్తానం’టూ తనను ఆహ్వానించాల్సిందిగా కోరారు. మీరు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారని పిలవడం లేదు మేడం. ఇప్పుడు చెప్తున్నారు గదా. తప్పనిసరిగా ముఖ్యమైన ఫంక్షన్లకు మిమ్మల్ని ఆహ్వానిస్తా’మని పీఎస్.మునిరత్నం ఆమెకు తెలిపారు. ‘నేనెప్పుడూ రాజకీయంగా మాట్లాడలేదు. మీరందరూ బాగా పనిచేయాలి. మీకేవైనా కావాల్సి వస్తే నన్ను అడగండి. సారు బిజీ కాబట్టి, మీ బాధలు నేను పట్టించుకుంటాను. వీలైనంత వరకు తీర్చేందుకు ప్రయత్నిస్తాను’ అంటూ భువనేశ్వరి తెలుగు తమ్ముళ్లకు పూర్తి భరోసా ఇచ్చారు. ఆమె తమతో మాట్లాడడం, కుప్పం టీడీపీ వర్గాలకు స్ఫూర్తిగా ఉంటుందని పీఎస్.మునిరత్నం ఆమెతో చెప్పారు.