నెల క్రితం వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవటం, ఎవరూ ఊహించని మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఎంతో కష్టపడినా, ఒక్క ఛాన్స్ అనే నినాదం పని చెయ్యటంతో, జగన్ అనూహ్య విజయం సాధించారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా తారు మారు అయ్యింది. చంద్రబాబు పతనం కోసం ఎదురు చూస్తున్న శక్తులు అన్నీ ఏకం అయ్యాయి. చంద్రబాబును మరింతగా మానసికంగా దెబ్బ కొట్టటానికి ఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైన వారిని, సీనియర్ నేతలని లాగేసుకుని, పార్టీని మరింత బలహీన పరిచే కార్యక్రమం చేస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఈ కుట్రలు అన్నిటినీ ఎదురుకుని, పార్టీని మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో, తాజగా వచ్చిన ఎన్నికల ఫలితాల పై, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య, నారా భువనేశ్వరి స్పందించారు.
ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని, గండిపేటలోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో ఆమె పర్యటించారు. ఇటీవల జరిగిన పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను నారా భువనేశ్వరి అభినందించారు. ఈ సందర్భంగా స్కూల్ లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంలో అక్కడ పిల్లలకు గెలుపు ఓటములు గురించి చెప్తూ, ఎన్నికల ఫలితాల ప్రస్తావన తీసుకు వచ్చారు. జీవితంలో గెలవటం, ఓడిపోవటం చాలా సహజం. ఓడిపోయామని కుంగిపోకూడదు. ధైర్యంగా నిలబడండ, పోరాడటం అలవర్చుకోవాలని పిలుపిచ్చారు. కార్యక్షేత్రంలోకి దిగితేనే దాని లోతు తెలిసి, ఏమి జరిగిందనే వాస్తవాలు తెలుస్తాయని భువనేశ్వరి అన్నారు. నిబద్ధత, ఏకాగ్రత, పట్టుదలతో ఉంటే, ఏ పనైనా సాధించవచ్చని, భునేశ్వరి అన్నారు.