దేశంలోనే ప్రధమంగా అమరావతి రాజధానిలో భూసమీకరణ పథకం అమలుచేయడం పట్ల బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ హర్షం వ్యక్తం చేశారు. అవురావతి రాజధాని నగరానికి రైతుల నుంచి స్వచ్చంధంగా భూములు సమీకరించిన విధానం పై అధ్యయనానికి ప్రత్యేకంగా ఏపీకి వచ్చిన ఆయన సోమవారం విజయవాడ ఏపీసిఆర్టీఏ కార్యాలయాన్ని సందర్శించారు. కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ప్రత్యేక కమిషనర్ వి రామ మనోహరరావు బీహార్ ఉప ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ల్యాండ్ పూలింగ్ స్కీం పై ప్రజెంటేషన్ ఇచ్చారు.
రాజధానికి కావాల్సిన భూమి అత్యంత వేగంగా సమీకరించి, రైతులకు తిరిగి ప్లాట్లు కేటాయించడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యమైన అంశాలను స్వయంగా నోట్బక్లో నమోదు చేసుకుంటూ ల్యాండ్ పూలింగ్ స్కీం అమలు పై మోడీ తన సందేహాలను వ్యక్తపర్చారు. గతంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ పూలింగ్ విధానం అమలులో ఉండేదా అని ఆయన ప్రశ్నించగా దానికి శ్రీధర్ స్పందిస్తూ రైతుల్ని రాజధాని అభివృద్ధిలో భాగస్వాముల్ని చేస్తూ ప్రజా రాజధానిగా అభివృద్ధి పరిచే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు భూ సమీకరణ పధకాన్ని రూపొందించారని వివరించారు.
కేవలం రెండు నెలల వ్యవధిలోనే 32వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సమీకరించేందుకు పలు దఫాలుగా వారితో సమావేశమై, వారికి ఈ పథకం పై విస్తృత అవగాహన కల్పించామని తెలియజేశారు.
రాజధాని నగరం మాస్టర్ ప్లాన్ అనుగుణంగా ఉండటంతోపాటు, వేర్వేరు స్థాయిల్లో రైతులకు ప్రయోజనం కలిగే విధంగా వీటిని వర్గీకరించి రైతులకు కేటాయించామని, దీంతో ప్లాట్లను స్వీకరించిన రైతులు పూర్తి స్థాయి సంతృప్తి వ్యక్తం చేశారన్నారు.