ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పైన ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేసారు. బీహార్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ఏపి విభజన అంశంలో తలెత్తిన సమస్యలు..ప్రస్తుత పరిస్థితిని వివరించే ప్రయత్నం చేసారు. అయితే, అయిదేళ్లయినా ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదని చెబుతూనే..రెండు ప్రాంతాల్లోని ప్రజల మనోభావాల గురించి ప్రస్తావించారు. ప్రచారంలో ప్రధాని మోదీ ఏపి-తెలంగాణగా రాష్ట్ర విభజన జరిగిన నాటి పరిస్థితులను గుర్తు చేసారు. బీహార్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రాష్ట్ర విభజన అంశాన్ని లేవనెత్తారు. వాజ్పేయి హయాంలో మూడు రాష్ట్రాల విభజన సక్రమంగా జరిగిందని చెప్పుకొచ్చారు.
బీహార్ నుండి జార్కండ్ ను విభజించిన సమయంలో రెండు ప్రాంతాలకు నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారని..తద్వారా రెండు ప్రాంతాల్లోనూ ఎటువంటి ఆందోళన లేకుండా విభజన సక్రమంగా జరిగిందని వివరించారు. ఇక, తెలుగు రాష్ట్రాల విభజన చేసిన కాంగ్రెస్ పైన పరోక్ష విమర్శలు చేసారు. నాడు అనుసరించిన విధానాల కారణంగా అయిదేళ్లయినా సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పుకొచ్చారు. రెండు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే ప్రజలే ఉన్నా ఇప్పటికీ ఒకరి కళ్లలో ఒకరు చూసుకోలేని పరిస్థితి ఉందని వివరించారు.
రాష్ట్ర విభజన జరిగి అయిదేళ్లయినా..ప్రధాని మోదీ నోట అనేక సార్లు ఇదే విషయాన్ని ఇదే విధంగా చెబుతూ వస్తున్నారు. విభజన సమయంలో బీజేపీ సైతం మద్దతిచ్చిన విషయాన్ని ఆయన ఉద్దేశ పూర్వకంగానే విస్మరిస్తున్నారు. విభజన జరిగే సమయంలో నాటి ప్రధాని ఇచ్చిన హామీల అమలును అదే స్థానంలోకి వచ్చిన మోదీ అమలు చేయటంలో నిర్లక్ష్యం చేసారు. ఏపీకీ తాను ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. రాజ్యసభలో బీజేపీ నేతలే ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేసారు. కానీ, ఇప్పటి వరకూ అది అమలు కాలేదు. ఇక, ఏపి-తెలంగాణ మధ్య సమస్యల పరిష్కారానికి కేంద్రం నుండి కనీస ప్రయత్నాలు జరగలేదు. కానీ, ఇప్పటికీ ఏపీ విభజనలో తమకు
సంబంధం లేదన్నట్లుగా మోదీ మాట్లాడుతున్న తీరు చర్చనీయాంశంగా మారుతోంది.