మొన్న జరిగిన తెలంగాణా ఎన్నికల్లో ఎంత మంది ఓట్లు లేపెసారో చూసాం. ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ లో, రాజకీయ పార్టీలకు, ఈ ఓట్లు లేపెయ్యటం కూడా ఒక భాగం అయ్యింది. ఎప్పటికప్పుడు మన ఓటు ఉందో లేదో చూసుకోవాలి, లేకపోతే పోలింగ్ జరిగే రోజు, అక్కడకు వెళ్లి మీ ఓటు లేదని అవాక్కవ్వల్సిందే. ఓటర్లకు తెలియకుండానే వారి పేరిట ఫారం-7 రూపంలో తొలగింపు కోసం ఆన్‌లైన్‌లో లక్షల సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తుతుండటంతో అసలు తమ ఓటు ఉందా? లేదా? అనే సందిగ్ధత అర్హులైన ఓటర్లలో నెలకొంది. నిబంధనల ప్రకారం తొలగింపు కోసం వచ్చిన దరఖాస్తులన్నింటినీ క్షేత్రస్థాయిలో విచారించాలి. ఎవరి ఓట్లు తొలగించాలని దరఖాస్తులు వచ్చాయో వారికి సమాచారం ఇవ్వాలి. అయితే లక్షల సంఖ్యలో తొలగింపు దరఖాస్తులు వస్తున్నందున క్షేత్ర పరిశీలన చాలా కష్టసాధ్యమని, విచారణ లేకుండానే అర్హుల ఓట్లు కూడా తొలగించే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఓటరు జాబితాలో తమ పేరుందా? లేదా? అని ప్రతి ఓటరు సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది.
ఓటరు జాబితాలో మీ పేరున్నదీ లేనిదీ ఇప్పుడే పరిశీలించుకోవచ్చు. ఇందుకు నాలుగు మార్గాలున్నాయి. ఆ వివరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించింది. చివరి నిమిషంలో నిరాశ చెందకుండా.. మీ ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ముందుగా పేరు ఉందో లేదో చూసుకోండి, పేరు లేకపోతే ఫారం-6లో దరఖాస్తు చేసుకుని ఇప్పటికైనా ఓటరుగా చేరొచ్చని స్పష్టం చేస్తోంది. ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనేది తెలుసుకోవడం ప్రతి ఓటరు ప్రాథమిక బాధ్యత. సంక్షిప్త సందేశాలు పంపించడం ద్వారా, వెబ్‌సైట్‌ల్లో చూసుకోవడం, రాష్ట్ర, జిల్లా స్థాయి కాల్‌సెంటర్‌లకు ఫోన్ చేయడం ద్వారా జాబితాలో పేరుందా? లేదా అనేది తెలుసుకోవొచ్చు. పోలింగ్ కేంద్రాల్లో నుంచి కూడా జాబితాలు చూసుకుని తనిఖీ చేసుకోవచ్చు. పేరు లేకపోతే తక్షణమే ఫారం-6లో దరఖాస్తు చేసుకోండి. నామినేషన్ల స్వీకరణ చివరి రోజు వరకూ ఈ అవకాశం ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి.
ఇంకా సందేహాలు ఉంటే ఈ 1950 నెంబరుకు ఫోన్ కాల్స్ ద్వారా కూడా సంక్షిప్త సందేశం లేదా వాట్సాప్ సందేశం పంపించి నివృత్తి చేసుకోవచ్చు. వాటికి నేనే నేరుగా స్పందిస్తా. ప్రత్యేక యాప్ ఉంది. మెసేజ్ ద్వారా మీ ఓటు ఉందో లేదో తెలుసుకోవాలి అంటే, ఈసీఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను టైప్ చేసి 1950 నెంబరుకు పంపించాలి. రెండో విధానం, www.ceoandhra.nic.in, www.nvsp.in వెబ్సైటు లో చెక్ చేసుకోవటం, మూడో విధానం, కాల్ సెంటర్ కు ఫోన్ చెయ్యటం 1950 , నాలుగో విధానం, నేరగా పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి చూడటం. ప్రతి శనివారం, మీ పోలింగ్ కేంద్రంలో ఈ జాబితా ఉంటుంది. ఇలా నాలుగు విధాలుగా, మీ ఓటు ఉందో లేదో తెలుసుకుని, అప్రమత్తంగా ఉండవచ్చు.