సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తెలిసిందే. కాని ఆ విమర్శలు నానాటికీ తారస్థాయికి చేరుకుంటున్నాయి. సమాజంలో తమ స్థాయిని మర్చిపోయి ఎదుటివారిపై కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి గురించి భాజపా మాజీ ఎమ్మెల్యే అలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘మోదీ ఇంటి నుంచి బయటకి వచ్చే ముందు ముఖానికి 10 సార్లు పౌడర్ రాసుకుంటారని, రోజులో 10 సార్లు దుస్తులు మారుస్తారని కుమారస్వామి అన్నారు. మోదీ ముఖంలోనే ఆ తేజస్సు ఉంది. కాని కుమారస్వామి 100 సార్లు స్నానం చేసినా బర్రెలానే ఉంటారు’ అని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీకి టీవీల్లో ప్రచారం బాగా లభిస్తుందంటూ కుమారస్వామి గతంలో అన్నారు. ‘మోదీ ఇంటి నుంచి బయటకి వచ్చేటప్పుడు 10 సార్లు పౌడర్ రాసుకుని వస్తారు. టీవీల్లో బాగా కనిపించడానికే మోదీ అలా చేస్తున్నారు. మేము సాధారణ మనుషులం. ఉదయం స్నానం చేసి బయటకి వస్తాం. మళ్లీ మరునాడు ఉదయం స్నానం చేస్తాం. ఈలోపు ఒకటి రెండు సార్లు ముఖం కడుక్కుంటాం. అందుకే మా ముఖాల్లో అంత తేజస్సు కనిపించదు. ఈ కారణంతోనే కొందరు పాత్రికేయులు మోదీని చూపించినట్లుగా మమ్మల్ని టీవీల్లో సరిగా చూపించడం లేదు’ అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాజు కాగే కుమారస్వామిని వ్యక్తిగతంగా విమర్శించారు.
ఇదే తరహాలో సినీనటి జయప్రద గురించి ఎస్పీ పార్టీకి చెందిన ఒక నేత వ్యక్తిగత విమర్శ చేశారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగింది. నాయకులు తాము చేసిన అభివృద్ధి, చేయదలచిన అభివృద్ధి, పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరించడం మానేసి ఇలా వ్యక్తిగత విమర్శలకు దిగడం ఏమాత్రం మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వారి విమర్శల స్థాయి దిగజారే కొద్దీ వారికి ప్రజల్లో ఉన్న ఆదరణ తగ్గడమే కాకుండా వారిపై వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయని, తద్వారా అల్లర్లు కూడా చెలరేగుతాయంటూ హెచ్చరిస్తున్నారు.