రాష్ట్ర రాజకీయాల్లో శరవేగంగా మారుతున్న పరిణామాలతో ఆంధ్రప్రదేశ్‌లో చచ్చిపోయింది అనుకున్న కాంగ్రెస్, మళ్ళీ ఊపిరి పోసుకుంటుంది. బీజేపీ చేసిన ఘనకార్యలతో, మళ్ళీ మాకు ఒకటి అరా సీట్లు వస్తాయని, తద్వారా, మళ్ళీ రాష్ట్రంలో పుంజుకుంటామని కాంగ్రెస్ భావిస్తుంది. అంతేగాక జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీకి దగ్గరవడం ఖాయమన్న ధీమా కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది నాయకుల్లో ఉండడం గమనార్హం. అయితే కాంగ్రెస్ నేతల ఆశలు వాస్తవరూపం దాలుస్తాయా అనే ప్రశ్నకు, సాధ్యమేనన్న సమాధానం విశ్లేషకుల్లో కూడా వ్యక్తమవుతోంది. ఇందుకు రాష్ట్రానికి సంబంధించి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ఆ పార్టీని పల్లెత్తు మాట అనకుండా ప్రతిపక్ష పార్టీ వైసీపీ అనుసరిస్తున్న వైఖరే కారణమని వారు అభిప్రాయపడుతున్నారు.
నాలుగేళ్ల క్రితం రాష్ట్రానికి కాంగ్రెస్‌పార్టీ ద్రోహం చేసిందన్న కారణం చూపి, బీజేపీ వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీని దగ్గర చేసుకుని, రాష్ట్ర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని వారంటున్నారు. దీంతో కాంగ్రెస్ పై కోపం ఉన్న వారు, బీజేపీతో చెలిమి కట్టిన టీడీపీకి రాష్ట్రంలో పట్టం కట్టారని పేర్కొంటున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత క్రమేణా కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. నాలుగేళ్లు గడిచినా రాష్ట్ర ప్రధాన సమస్యలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ టీడీపీ కేంద్ర ప్రభుత్వం, ఏన్డీఏ నుంచి వైదొలిగింది. దాంతో కాంగ్రెస్ నేతలు స్వరం పెంచి నాడు తాము చేసింది తప్పతైతే నేడు బీజేపీ చేసింది నమ్మక ద్రోహం కాదా అని ఎదురుదాడికి దిగడంతో ప్రజలు ఆ పార్టీ వైపు ఆలోచించడం ప్రారంభించారని వారంటున్నారు.
తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాహుల్ గాంధీ రాష్ట్ర సమస్యలన్నింటి పై, ప్రధానంగా ప్రత్యేక హోదాకు నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కారం చూపుతామన్న ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఆశలు చిగురించాయి. నాడు కాంగ్రెస్ చేసిన తప్పిదానికి ఫలితం అనుభవించిందని తరువాత బీజేపీ వ్యవహరించిన తీరుతో మళ్లీ కాంగ్రెస్ వస్తే న్యాయం జరుగుతుందన్న అభిప్రాయం ప్రజల్లో రావడం సహజమని వారంటున్నారు. రాష్ట్ర సమస్యలపై స్పందించకుండా నాలుగేళ్ల నుంచి నిన్నా మొన్నటి వరకూ అన్నీ ఇస్తామన్న బీజేపీ నేతలు నేడు ఏదో ఒక సాకు చూపుతూ ఏదీ సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నా, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఆ పార్టీని ఒక్క మాట కూడా మాట్లాడకుండా అన్నింటికీ టీడీపీ కారణమని విమర్శిస్తున్న విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
విభజన సమయంలో కూడా లోక్‌సభలో నాడు ఎంపీగా ఉన్న జగన్ తీరు కారణంగానే ప్రజలు టీడీపీ వైపు చూశారని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా నాడు కాంగ్రెస్‌కు దూరమైన నేతలు మళ్లీ సొంత గూటికి చేరుకుంటే పార్టీ పరిస్థితి మెరుగయ్యే అవకాశాలు లేకపోలేదని వెల్లడిస్తున్నారు. అయితే పూర్తిస్థాయిలో ఇప్పుడే ఖచ్చితమైన నిర్ణయం చెప్పలేమని రానున్న రోజుల్లో టీడీపీ, వైసీపీ వ్యవహరించే తీరుపై ఇది ఆధారపడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇక సినీనటుడు, జనసేనపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రస్తుతం వామపక్ష పార్టీలతో సన్నిహితంగా ఉంటున్నారని, భవిష్యత్తులో ఎన్నికల సమయానికి మారే రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన వైఖరి తేలుతుందని వారంటున్నారు. మొత్తానికి బీజేపీ చేసిన ఘనకార్యంతో, ఆంధ్రప్రదేశ్ లో చచ్చిపోయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీ, ఊపిరి తీసుకుంటుంది.