సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేసేలా తమకు అనుకూలంగా కథనాలు ప్రసారం చేయాలంటూ రిపోర్టర్ లకు లంచం ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని జమ్మూకశ్మీర్ లోని లేహ్ కు చెందిన జర్నలిస్ట్ ల బృందం ఆరోపించింది. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ వీడియోలో జమ్మూకశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా, ఆ పార్టీ శాసనసభ్యుడు విక్రమ్ రంద్వాలు జర్నలిస్ట్ లకు డబ్బులను ఎన్వలప్ కవర్లలో పెట్టి ఇచ్చినట్లు ఉంది. దీనిపై లేహ్ ప్రెస్ క్లబ్ సభ్యులు స్థానిక ఎన్నికల అధికారికి లేఖ రాశారు. గురువారం (మే-2,2019) హోటల్ సింగీ ప్యాలెస్ లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన సమయంలో జర్నలిస్ట్ లకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని ఆ లేఖలో ఆరోపించారు.
అయితే ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. లేహ్ ప్రాంతంలో రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ ర్యాలీ కవర్ చేసేందుకు జర్నలిస్ట్ లకు ఇన్విటేషన్ లెటర్స్ ఇచ్చినట్లు బీజేపీ తెలిపింది. ఆరోపణలు చేసిన జర్నలిస్ట్ లపై పరువునష్టం దావా వేస్తామని బీజేపీ హెచ్చరించింది. ఎన్వలప్ కవర్లు అందుకున్న జర్నలిస్ట్ లలో ఒకరైన రిన్ చన్ అన్ గ్మో మాట్లాడుతూ...సింగీ ప్యాలెస్ లో మీడియా సమావేశ సమయంలో బీజేపీ సీనియర్ లీడర్ నలుగురు జర్నలిస్ట్ లకు ఎన్వలప్ కవర్లు ఇచ్చారు. ఎన్వలప్ కవర్లను ఇక్కడ ఓపెన్ చేయవద్దు అని ఆయన సూచించారు. ఎన్వలప్ అందుకున్న వారిలో నేను కూడా ఉన్నాను.రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి సమక్షంలో ఇదంతా జరిగింది. నాకు అనుమానం వచ్చి ఓపెన్ చేశాను. కొన్ని రూ.500నోట్లు అందులో ఉన్నాయి. దీంతో తిరిగి ఆయనకే ఆ ఎన్వలప్ ఇచ్చాను. అయితే ఆయన అది తీసుకునేందుకు నిరాకరించారు.
అయితే ఆ ఎన్వలప్ ను అక్కడే టేబుల్ పై ఉంచినట్లు ఆమె తెలిపింది. జర్నలిస్ట్ ల కంప్లెయింట్ తో ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఎలక్షన్ కమిషన్ చర్యలు ప్రారంభించింది. కంప్లెయింట్ ను లోకల్ కోర్ట్ కి పంపించినట్లు, ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కోర్టు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఐదో దశలో భాగంగా లడఖ్ రీజియన్ లో సోమవారం(మే-6,2019) పోలింగ్ జరిగింది. లడఖ్ లో ముస్లిం కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నప్పటికీ బీజేపీ,కాంగ్రెస్ లు బుద్దిస్ట్ అభ్యర్థులను బరిలో నిలిపాయి. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో 36 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి లడఖ్ సీటుని బీజేపీ దక్కించుకుంది.అయితే గతేడాది నవంబర్ లో లడఖ్ బీజేపీ ఎంపీ తుప్స్ స్తాన్ చెవాంగ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.మరికొందరు కీలక నాయకులు కూడా బీజేపీకి రాజీనామా చేశారు.