పెట్రోల్, డీజీల్ ధరల పెరుగుదల, రాఫెల్ ఒప్పందం, ఎస్సీ-ఎస్టీ చట్టంపై అగ్రవర్ణాల వ్యతిరేకత వంటి కీలక అంశాలపై సమాధానాలిచ్చేందుకు బీజేపీ ఇబ్బంది పడింది. శనివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సదస్సు ప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. సమావేశం లోపల ఏం జరిగిందో చెప్పిన తర్వాత ఆమెను విలేకరులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అధ్యక్షుడు అమిత్‌షా ప్రారంభోపన్యాసానికి సంబంధించిన ప్రశ్నలే అడగాలని నిర్మల కోరారు. ముందుగా తాము అడిగిన ప్రశ్నలకు బదులివ్వాలని పాత్రికేయులు డిమాండ్ చేశారు.
బీజేపీ మీడియా విభాగం డిప్యూటీ ఇన్‌ఛార్జ్ సంజయ్ మయూఖ్ జోక్యం చేసుకుని.. సమావేశం పూర్తైనట్లు ప్రకటించారు. వెంటనే నిర్మల కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ముందస్తు ఆదేశాలు లేనిదే.. నిర్మల ఇలా పాత్రికేయుల ప్రశ్నల నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నించబోరని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మీడియా లేవనెత్తిన ఆ మూడు అంశాలు పార్టీకి ప్రస్తుతం ఇబ్బందికరంగా ఉన్నాయని.. వాటిని అధిగమించేందుకు అగ్ర నాయకత్వం కృషి చేస్తోందని బీజేపీ అంతర్గత వర్గాలు తెలిపాయి.
పెట్రోల్‌ను కూడా జీఎస్‌టీ పరిధిలోకి తేవాలని ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పిలుపు రావాలని కేంద్రం ఆశిస్తోంది. ఎస్సీ-ఎస్టీ చట్టానికి వ్యతిరేకంగా అగ్రవర్ణాల ఉద్యమంతో.. భాజపాకు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల మద్దతు పెరిగే అవకాశం ఉంది. దీంతో అగ్రవర్ణాల డిమాండ్‌ను ఆ పార్టీ తీవ్రంగా పరిగణించడం లేదు. మరోవైపు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌పై ప్రతిదాడిగా.. హరియాణాలోని భాజపా ప్రభుత్వం రాబర్ట్ వాద్రా పై భూ అక్రమాలకు సంబంధించిన కేసు పెట్టింది. రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ ముందుకు వెళ్తే.. వాద్రాపై విచారణ తీవ్రమవుతుందని ఈ చర్యతో భాజపా హెచ్చరించినట్లైంది.