ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఎటు వైపు ఉన్నాయో అర్ధం అవుతుంది కానీ, ఏపి బీజేపీ మాత్రం ఎవరికీ అర్ధం కాదు. వాళ్ళు తమ పార్టీ కోసం పని చేస్తున్నారో, జగన్ మోహన్ రెడ్డికి మేలు చేయటం కోసం పని చేస్తున్నారో, పజిల్ గానే ఉంటుంది. గతంలో టిడిపితో మిత్రపక్షంగా ఉన్నా, సోము వీర్రాజు, జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు, ప్రతి రోజు టిడిపి విమర్శిస్తూ, వైసీపీ ఆరోపణలకు బలం చేకూర్చే వారు. సోము వీర్రాజు మళ్ళీ టిడిపి బలంతోనే ఎమ్మెల్సీ అయ్యారు కూడా. అయినా ఆయన అప్పట్లో టిడిపిని కార్నర్ చేస్తూ, వైసీపీకి బెనిఫిట్ అయ్యే విధంగా ప్రవర్తించేవారు. ఇక జీవీఎల్ అయితే ప్రతి రోజు ఎదో ఒక అంశంతో వచ్చి రచ్చ రచ్చ చేసే వారు. అలాగే మీడియా చానల్స్ కు ఎక్కి విష్ణు వర్ధన్ రెడ్డి చేసే హడావిడి అంతా ఇంటా కాదు. ఇలా అందరూ మామూలు రచ్చ చేసే వాళ్ళు కూడా. ఇప్పుడు బీజేపీ, జనసేన కలిసి మిత్రపక్షంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్, ఎందుకు కలిసారో తెలియదు కానీ, కలిసిన దగ్గర నుంచి ఏపి బీజేపీ పై అసంతృప్తితోనే ఉన్నారు. అలాగే కార్యక్రమాలు కూడా, ఏ పార్టీకి ఆ పార్టీ చేసుకుంటుంది కాని, కలిసి మాత్రం చేయటం లేదు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా, బీజేపీ, జనసేన ప్రభావం, ఏమి లేదు. ప్రధానంగా క్యాడర్ కలిసి పని చేసింది ఏమి లేదు.
ఇంకా ఆశ్చర్యకరంగా, కొన్ని చోట్ల, టిడిపి, జనసేన కలిసి పని చేసుకుని, గెలిచారు కూడా. ఈ నేపధ్యంలోనే, గత నెల రోజులుగా, బీజేపీతో పవన్ ఉండరు అనే చర్చ మీడియాలో నడుస్తుంది. ఈ అంశం పక్కన పెడితే, గత రెండున్నరేళ్ళుగా వైసీపీ పై పెద్దగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేయని పవన్ కళ్యాణ్, మొన్న జరిగిన సినిమా ఫంక్షన్ లో వైసిపీ పై చెలరేగి పోయారు. వైసీపీ పై అనేక విమర్శలు చేసారు. అలాగే అటు వైపు వైసీపీ నుంచి కూడా అదే విధమైన విమర్శల దా-డి మొదలైంది. అయితే అనూహ్యంగా బీజేపీ వైపు నుంచి రియాక్షన్ లేదు. ఈ రోజు జీవీఎల్ ఒక ట్వీట్ చేసి దులుపుకున్నారు. మిత్రపక్షం అని చెప్పుకునే పవన్ పై ఇంత దా-డి జరుగుతున్నా, బీజేపీ సౌండ్ చేయటం లేదు. సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి అడ్డ్రెస్ లేరు. వైసీపీని బీజేపీ నేతలు ఎందుకు విమర్శలు చేయటం లేదో అర్ధం కావటం లేదు. మొత్తంగా బీజేపీ, జనసేన మధ్య సఖ్యత లేదు అనే విషయం, మరోసారి ఈ ఎపిసోడ్ తో తేలిపోయింది. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.