రాష్ట్రవ్యాప్తంగా శాసన మండలి పై వైఎస్ జగన్మోహన రెడ్డి చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. శాసనసభలో సోమవారం ఏమి జరగబోతోందనే చర్చ సర్వత్రా నెలకొన్నది. అన్ని రాజకీయ పక్షాల్లో ఇప్పుడదే చర్చనీ యాంశంగా మారింది. మండలి రద్దుపై శాసనసభలో ముఖ్యమంత్రి ఏ విధంగా ముందుకు వెళ్లనున్నారనే దానిపై ప్రతి రాజకీయ పార్టీ ప్రత్యేక దృష్టిసారించిన నేపధ్యంలో బీజేపీ వైఖరి ఏ విధంగా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది. మండలి రద్దుపై శనివారం పార్టీలో సమగ్రంగా చర్చించేందుకు బీజేపీ నేతలు నిర్ణయించి నట్లు తెలిసింది. అప్పటి వరకు నేతలు ఎవరూ శాసనమండలి రద్దుపై అనుకూల, వ్యతిరేక ప్రకటనలు చేయవద్దంటూ పార్టీపరంగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మూడు రాజధానులపై ప్రభుత్వ వైఖరిని బీజేపీ వ్యతిరేకిస్తోంది. అమరావతినే రాజధానిగా కొనసా గించాలనేది బీజేపీడిమాండ్. అభివృద్ధి వికేంద్రీకరణకు తాము సుముఖమే తప్ప పాలనా వికేంద్రీకరణకు వ్యతిరేకమంటూ తొలి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నేతలు చెపుతున్నారు.
తెదేపా, వామపక్షాలు సహా అన్ని పార్టీలు మండలి రద్దుపై బాహాటంగానే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ... ఇప్పటి వరకు బీజేపీ నేతలు మాత్రం స్పందించ లేదు. బీజేపీ తరుపున ఎమ్మెల్సీ లుగా సోము వీర్రాజు, పీవీఎన్ మాధవ్ ఉన్నారు. ఇటీవల తెదేపా ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి కూడా బీజేపీలో చేరడంతో ఆ పార్టీ బలం మూడుకు చేరింది. ఢిల్లీలో కీలక నేతలు రానున్న రోజుల్లో జనసేనతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న ఆందోళనా కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఇరుపార్టీలకు చెందిన కీలక నేతలు ఢిల్లీలో ఉన్నారు.గత మూడు రోజులుగా వీరు బీజేపీ అగ్రనేతలతో భవిష్యత్ ఉమ్మడి వ్యూహాలపై చర్చించడంతో పాటు కార్యాచరణ రూపొందించే పనిలో ఉన్నారు. ఇప్పటికే తొలి కార్యక్రమంగా ఫిబ్రవరి 2న గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి విజయవాడ లోని స్వరాజ్య మైదానం వరకు రాజధాని మార్పును వ్యతి రేకిస్తూ 'లాంగ్ మార్చ' ప్రకటిం చారు.
జగన్ ప్రకటన చేసిన సమయంలో ఢిల్లీలో ఉన్న నేతలు బీజేపీ పెద్దలతో సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. వీరంతా శుక్రవారం రాత్రికి విజయవాడ చేరుకోనున్నారు. కీలక నేతలు వచ్చిన వెంటనే కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో భేటీ కానున్నారు. ముఖ్య నేతలతో పాటు పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు సమావేశంలో పాల్గొని తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చ నున్నారు. ఆ తర్వాత పార్టీ పరంగా ఓ నిర్ణయానికి వచ్చి మండలి రద్దు అంశంపై స్పందించనున్నారు. విపక్ష ఎమ్మెల్సీలను బెదిరించేందుకే మండలి రద్దు అస్త్రం ముఖ్యమంత్రి జగన్ ప్రయోగించారనే అభిప్రాయం బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. మండలిలో వికేంద్రీకరణ బిల్లు వీగిపోవడంతో రద్దు అంశాన్ని ప్రయోగించడం ద్వారా అనుకూల వైఖరికి వచ్చే విధంగా పావులు కదుపుతున్నట్లు భావిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో పార్టీ పరంగా స్పష్టమైన వైఖరి తీసుకోనున్నట్లు బీజేపీ వర్గాల సమాచారం.