శాసన మండలి రద్దు చేస్తూ రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానంపై నాయకులెవరూ బహిరంగ ప్రకటనలు ఇవ్వవద్దని బీజేపీ అధిష్టానం జారీచేసినట్లు సమాచారం. ఢిల్లీ శాసనసభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఫిబ్రవరి రెండవ వారంలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు తీర్మానం పై చర్చించి పార్లమెంటులో ఏ విధమైన వైఖరి తీసుకోవాలనే అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారని సమాచారం. శాసనమండలి రదుపై ఇప్పటికే రాష్ట్రంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు కన్నా లక్ష్మీనారాయణ సైతం దీనిపై ఆచితూచి స్పందించారు. ఈ నేపధ్యంలోనే బీజేపీ కోర్ట్ కమిటీ నిర్ణయం వెలువడే వరకు మౌనం పాటించాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. రాష్ట్ర శాసనమండలిలో బీజేపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న సోము వీర్రాజు, మాధవ్ లు ఇరువురూ పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే కన్నా లక్ష్మీనారాయణనే కొనసాగించటం మంచిదన్న అభిప్రాయంలో అధి ష్టానం ఉన్నట్లు ఆ పార్టీలో సంభాషణలు జరుగుతు న్నాయి.
శాసనమండలి రద్దు తీర్మానం రాజధాని అమరావతి అంశంతో ముడిపడి ఉన్నందున పార్టీ వైఖరి ఏ విధంగా ఉండాలన్న విషయమై లాభనష్టాలు బేరీజు వేసుకుంటున్నారు. ఫిబ్రవరి 2వ వారంలో 'కోర్' కమిటీలో చర్చ జరిగినప్పటికీ శాసనసభ రదు తీర్మానం త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాలలో చర్చకు వచ్చే అవకాశం లేదని బీజేపీ ప్రముఖుడు ఒకరు చెప్పారు. ఏదిఏమైనా రాష్ట్ర శాసనమండలి భవితవ్యం పూర్తిగా బిజెపి వైఖరి పైనే ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. ఇక రెండవ రాజధాని అంశం రాజ్యాంగ సభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్న విధంగా దేశానికి రెండవ రాజధాని అంశాన్ని తెరమీదకు తీసుకువస్తే బాగుంటుందని రాష్ట్ర బీజేపీ శాఖ యోచిస్తున్నట్టు చెబుతున్నారు. దేశ స్వరూప స్వభావాల దృష్యా దేశానికి మరో రాజధాని అవసరం అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గతంలో అభిప్రాయపడ్డారు. గత 7 దశాబ్దాలుగా అంబేద్కర్ సూచనపై కనీసం చర్చ సైతం జరగలేదని, ఈ తరుణంలో దానిపై ఒక నిర్ణయం తీసుకుంటే బాబాసాహెబ్ సిద్ధాంతాలను గౌరవించినట్టవుతుందని బీజేపీ వర్గాల భావనగా ఉంది.
ఒకవేళ ఈ ప్రతిపాదన తెరమీదకు వచ్చిన పక్షంలో సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన అమరావతి పేరునే ముందుకు పరిశీలించాలని రాష్ట్ర నాయకులు సూచించే అవకాశం ఉంది. గతంలో రెండవ రాజధాని ప్రస్తావన వచ్చినప్పుడు హైదరాబాద్ పేరు ప్రస్తావనకు వచ్చింది. అయితే హైదరాబాద్ కంటే అమరావతి ఉత్తమంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హిందూ సాంప్రదాయాలకు పెద్దపీట వేసే బీజేపీలో అమరావతి అందుకు అనువుగా ఉంటుందనేది వారి వాదన. ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీకి నష్టం వాటిల్లుతున్నం దున దానిని దక్షిణాదిన భర్తీ చేసుకోవాలని ఆ పార్టీ అధినాయకత్వం యోచిస్తుంది. ఎన్నో అనుకూలతలు ఉన్న అమరావతిని కేంద్ర స్థానంగా చేసుకుంటే సరిహదునే ఉన్న తెలంగాణా, కర్నాటక, తమిళ నాడు, ఒడిస్సా రాష్ట్రాలపై దృష్టి సారించే అవకాశం ఉంటుందనేది వారి భావన. ఈ అంశంపై సైతం కోర్ కమిటీలతో చర్చించే అవకాశముందని పార్టీ ప్రముఖులు చెబుతున్నారు.