‘ముఖం చాటేస్తున్న ప్రజలు... తల పలిగేలా ఎండ..!’ ప్రధానమంత్రి మోదీ వచ్చి వెళితే ఈ రెండింటినీ తట్టుకునే శక్తి వస్తుందనుకున్న రాష్ట్రంలోని బీజేపీ అభ్యర్థులు మరింత నీరసించారు. మోదీ కర్నూలు పర్యటన ఏమాత్రం ఉపయోగపడలేదు. దీంతో మెజారిటీ అభ్యర్థులు ‘ఎందుకు పోటీ చేస్తున్నామా?’ అని తలలు పట్టుకొంటున్నారు. నామమాత్రపు ప్రచారం కూడా నిర్వహించలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ పార్టీకి ఏపీలో గడ్డు పరిస్థితి నెలకొంది. ప్రచారంలో ఎక్కడా జనం రాకపోగా.. వీళ్లను చూడగానే ముఖం చాటేస్తున్నారు. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులు మాకొద్దు బాబోయ్ అని పారిపోతున్నారు. కర్నూలు జిల్లాలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, కడప జిల్లాలో ఒక లోక్‌సభ అభ్యర్థి వెంట వెంటనే ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో రాష్ట్ర పార్టీలో ఆందోళన మొదలైంది.
మోదీ వచ్చి వెళితే మార్పు వస్తుందని ఆశపడ్డారు. అనుకున్నట్లే ఈ నెల 29న మోదీ కర్నూలుకు వచ్చి రాయలసీమను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మోదీ ఎన్ని చెప్పినా ప్రజలు ఆయన మాటలు పట్టించుకోలేదు. అయినా పర్లేదని ప్రచారం చేస్తున్న అభ్యర్థులకు జనం నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ‘వెనుక బడిన ప్రాంతం అంటూనే రూ.350 కోట్లు ఇచ్చి లాక్కున్నారుగా..!’ అని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు మోదీ ఇచ్చారని అభ్యర్థులు బదులిస్తుంటే.. ‘ఆయన ఇచ్చింది మాకు తెలుసులే..! చెంబుడు నీళ్లు, కాస్త మట్టి’ అంటూ ముఖంమీదే చెబుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ పోత్తుతో 4లక్షలకుపైగా ఓట్లు సాధించిన రాజంపేట లోక్‌సభ స్థానంలో అర్ధాంతరంగా వైదొలగిన బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ అభ్యర్థుల్లో చర్చనీయాంశమయ్యాయి.
‘రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని ముందే అంచనా వేసిన సిటింగ్ ఎంపీలు జాగ్రత్త పడ్డారా?’ పార్టీ కేడర్‌లో ఇదే చర్చ జరుగుతోంది. గతంలో టీడీపీ మద్దతుతో 4 లక్షల ఓట్లు సాధించిన పురందేశ్వరి రాజంపేటలో పోటీ చేయనని ముందే చెప్పారు. విశాఖ రైల్వేజోన్ గురించి ప్రకటన రాగానే విశాఖ ఎంపీ సీటు కావాలని ఆమె పట్టుబట్టారు. సిటింగ్ ఎంపీ కంభంపాటి హరిబాబు గత ఎన్నికల్లో వైఎస్ విజయలక్ష్మిపై లక్ష ఓట్ల మెజారిటీ సాధించారు. ఆయన విశాఖ సీటును వదులుకుంటారని ఎవరూ అనుకోలేదు. పురందేశ్వరి మీ సీటు అడుగుతున్నారు అని పార్టీ పెద్దలు ఆయన చెవిన వేయగానే ‘నాకెలాంటి అభ్యంతరంలేదు. ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థుల్ని కూడా నన్ను సంప్రదించి ప్రకటించలేదు. అలాంటప్పుడు లోక్‌సభ సీటు కూడా మీ ఇష్టమే’ అని తేల్చేశారు. రైల్వేజోన్ ప్రకటన, ఉత్తరాది వారు ఎక్కువగా ఉండే సీటును హరిబాబు ఎందుకు వదులుకున్నారో.. ప్రస్తుతం బరిలో ఉన్న పురందేశ్వరి వాహనం వెనుక ఉన్న జనాన్ని చూశాక అర్థమవుతోందని పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. నరసాపురం సిటింగ్ ఎంపీ గోకరాజు గంగారాజు కూడా పోటీకి ససేమిరా అన్నారు. కృష్ణంరాజు భార్యను పోటీ చేయించేందుకు అధిష్ఠానం ప్రయత్నించింది. ప్రభా్‌సను ప్రచారానికి తీసుకురావొచ్చని ఎత్తుగడ వేసింది. అందుకు బాహుబలి ససేమిరా అనడం, కృష్ణంరాజు కుటుంబసభ్యులు అయిష్టంగా ఉండటంతో చేసేదిలేక అక్కడ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావును పోటీలోకి దించారు.