కేంద్ర మంత్రివర్గం నుంచి తాము తప్పుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలని నిర్ణయించింది. మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు గురువారం తమ పదవులకు రాజీనామా చేయనున్నారు. కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగాలని తెదేపా నిర్ణయించిన కొద్దిసేపటికే భాజపా మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్, ఇతర నేతలు విజయవాడలో అత్యవసరంగా సమావేశమయ్యారు. అనంతరం బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆకుల సత్యనారాయణ, మాధవ్‌లు విలేకరులతో మాట్లాడారు. గురువారం మా మంత్రులిద్దరూ పదవులకు రాజీనామాలు చేయబోతున్నారు అని చెప్పారు..
బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగిన పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం నుంచి తెదేపా వైదొలిగిన వెంటనే... రాష్ట్ర మంత్రుల పదవుల నుంచి వైదొలగాలని రాష్ట్ర భాజపా నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. భాజపా అధ్యక్షుడు హరిబాబు కామినేనితో ఫోనులో మాట్లాడారు.
మరో వైపు ఏపీ కేబినెట్ సమావేశం ఉండవల్లిలోని సీఎం నివాసంలో గురువారం ఉదయం జరిగింది. అయితే... ఈ సమావేశానికి బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావు గైర్హాజర్ అయ్యారు. ఏపీ వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తన రాజీనామా లేఖను సిద్ధం చేశారు. ఏ క్షణమైనా స్పీకర్‌కు తన రాజీనామా లేఖను సమర్పించేందుకు కామినేని రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.