భారతీయ జనతా పార్టీ ఉనికి విశాఖపట్నంలోనే కొద్దో గొప్పో ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఒక ఎంపీతో పాటు మరో ఎమ్మెల్యే కూడా ఎన్నికయ్యారు. మొన్నటి వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా ఎంపీ కంభంపాటి హరిబాబే వ్యవహరించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కూడా పార్టీ పెద్దలు విశాఖ నాయకునిగానే భావిస్తారు. దాంతో రాష్ట్రంలో బీజేపీ రాజకీయాలు విశాఖపట్నం చుట్టూనే పరిభ్రమిస్తుంటాయి. తాజాగా ఆ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాలకు చేపట్టిన కన్వీనర్ల నియామకం చర్చనీయాంశంగా మారింది. విశాఖపట్నంలో సీనియర్ నాయకుడు, రాష్ట్ర పూర్వ అధ్యక్షులు, సిట్టింగ్ ఎంపీ హరిబాబు వుండగా కాశీ విశ్వనాథరాజును కన్వీనర్‌గా నియమించింది. ఈ విషయమై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
బీజేపీ తప్పనిసరిగా బరిలో ఉంటుంది. విశాఖపట్నం పార్లమెంటు స్థానం ఆ పార్టీకి చాలా కీలకం. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు వుండడంతో హరిబాబు సులువుగా విజయం సాధించారు. ఈసారి బీజేపీ ఒంటరిగానే బరిలో దిగాల్సి ఉంటుంది. అటువంటి నేపథ్యంలో హరిబాబును కాదని కాశీ విశ్వనాథరాజును కన్వీనర్‌గా నియమించారంటే...ఏమి జరిగి వుంటుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పార్టీ ఆదేశిస్తే..మళ్లీ పోటీ చేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని ఇటీవల ఒకసారి ఎంపీ హరిబాబు విలేకరుల ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పార్టీ వర్గాలు మాత్రం ఆయన పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెబుతున్నాయి.
విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఎటు వైపు అడుగులు వేస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీపైరాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వున్న నేపథ్యంలో ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు వున్నాయని ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనకు ఆహ్వానం వుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యేగా, శాసనసభాపక్ష నేతగా చేసి వున్నందున ఈసారి ఎంపీగా పోటీ చేస్తే ఎలా వుంటుందో అనిఆయన అభిమాన వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదిలావుంటే విశాఖపట్నంలో ఎంపీగా చేసిన దగ్గుబాటి పురందేశ్వరి విశాఖ ఎంపీగా మళ్లీ బరిలో దిగినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని కొన్నివర్గాలు పేర్కొంటున్నాయి. ఆమెను తాజాగా ఒంగోలు కన్వీనర్‌గా నియమించారు.