తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపణలతో అధికార తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టాలనే బీజేపీ వ్యూహాం బెడిసికొట్టిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. గత కొద్ది రోజులుగా రమణ దీక్షితులు వ్యవహారంతో ఉక్కిరిబిక్కిరి అయిన తెదేపా నేతలు, రమణ దీక్షితులు జగన్ తో భేటీ తర్వాత ఖుషీగా ఉన్నారు. రమణ దీక్షితులు వ్యవహారాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసి లబ్దిపొందాలని చూసిన బీజేపీ నేతలు జగన్ తో సమావేశం తర్వాత నోరు మెదపని పరిస్తితి నెలకొంది. ఇప్పుడీ విషయం నుంచి ఏ విధంగా బయటపడాలనే దాని పై బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో నగలు మాయమైనట్లు, ఆలయంలో ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయంటూ గత నెలలో తితిదే మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపణలు చేశారు. గుప్త నిధుల కోసమే ఆలయంలో తవ్వకాలు జరుపుతున్నారంటూ రమణ దీక్షితులు బాంబు పేల్చారు. రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. రమణ దీక్షితులు ఆరోపణలపై విచారణకు బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు, రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ సహా పలువురు బీజేపీ నేతలు రమణ దీక్షితులు ఆరోపణలపై విచారణకు డిమాండ్ చేశారు.
ఈ వివాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు బీజేపీ నేతలు అన్ని విధాలుగా ప్రయత్నించారు. వీరికి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆరోపణలు కూడా మద్ద తుగా నిలిచాయి. రమణ దీక్షితులు ఆరోపణలు రాజకీయ దుమారం లేపడంతో ప్రభుత్వం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది. అయితే వీరు వారుస పెట్టి చేస్తున్న పనులు మాత్రం, అందరూ కలిసి తిరుమల పై పన్నిన కుట్రగా అర్ధమవుతుంది. అమిత్ షా తిరుమల వెళ్లి వచ్చిన తరువాత రోజే రమణ దీక్షితులు మీడియా ముందుకు రావటం, తరువాత బీజేపీ నాయకులను కలవటం, పరాకాష్ట అన్నట్టు, మొన్న జగన్ ను కలవటం , ఇవన్నీ చూస్తుంటే, అన్నీ ప్లాన్ ప్రకారమే చేస్తున్నారని అర్ధమవుతుంది. ఇప్పుడు జగన్, దీక్షితుల భేటీ గురించి సమర్ధించలేక, బీజేపీ నేతలు ఇబ్బంది పడుతున్నారు..