కొన్ని రోజుల క్రిందట, శ్రీశైలం ఫారెస్ట్ ఆఫీసర్‌ను కొట్టి, కాళ్లు మొక్కించుకున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దాడికి పాల్పడిన ఆరుగురు తెలంగాణకు చెందిన వారిని ఇప్పటికే ఆరెస్ట్ చేసి జైలుకు పంపారు. మరోవైపు శ్రీశైలం ఎస్సైపై టిడిపి ఎమ్మెల్యే కొడుకు దాడి చేశాడనే రెండు రోజుల నుంచి బీజేపీ కార్యకర్తలు కొంత మంది జాతీయ స్థాయి లో ప్రచారం చేస్తున్నారు. వీళ్ళకి వైసీపీ, జనసేన తోడయ్యారు. అయితే, ఇది అవాస్తవమని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. వీటిపై సాక్షాత్తూ ఏపీ డీజీపీ ఠాకూర్ సీరియస్ అయ్యారు. దీంతో కర్నూలు జిల్లా ఎస్పీ స్పందించారు. దీనిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ నెల 14వ తేది రాత్రి 12 గంటల సమయంలో శ్రీశైలం ఫారెస్ట్ ఆఫీస్ వద్ద మద్యం సేవిస్తున్న ఆరుగురిని విధుల్లో ఉన్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జ్యోతి స్వరూప్ వారించారు. ఇక్కడ మందు తాగొద్దని చెప్పారు. దీంతో మందు బాబులు రెచ్చిపోయి ఎమ్మెల్సీ కొడుకునే వెళ్లిపోమంటావా అని సెక్షన్ ఆఫీసర్‌పై దాడికి పాల్పడ్డారు. అంతేకాదు నానా బూతులు తిడుతూ గన్‌తో కాల్చిపడేస్తామంటూ మందుబాబులు బెదిరించారు. సెక్షన్ ఆఫీసర్‌ను కొట్టడమే కాకుండా చివరకు అతనితోనే కాళ్లు పట్టించుకుని వదిలిపెట్టారు. అయితే సెక్షన్ ఆఫీసర్‌పై దాడిచేస్తున్న దృశ్యాలను ఆ మందుగ్యాంగ్‌లోని ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశాడు. తాము డ్యూటీలో ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్‌నే కొట్టి అతనితోనే కాళ్లు పట్టించుకున్నామని బయట చెప్పుకొని ఫోజులు కొట్టొచ్చనుకున్నాడు. అయితే ఆ ప్లాన్ రివర్స్ అయ్యింది.
తాము తీసుకున్న గోతిలో తామే పడిపోయారు. నిందితుల బండారాన్ని తాము తీసిన వీడియోనే బయటపెట్టింది. దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు ఈ ఘటనకు కారకులైన ఆరుగురిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు నందికొట్కూరు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. దీంతో న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. అయితే దీని పై, బీజేపీ, వైసీపీ దుష్ప్రచారం చేసాయి. శ్రీశైలం దాడి దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి శ్రీశైలం ఎస్సైపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొడుకు దాడి చేశాడని, చంద్రబాబు వైఫల్యం అంటూ పోస్ట్ లు పెట్టారు. అయితే ఈ వీడియో, ప్రచారం వాస్తవం కాదని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. కొందరు దురుద్దేశ్యంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారని నిర్ధారించారు.