కాదేదీ అవినీతికి అనర్హం అన్నట్టు, తయారు అయ్యింది పరస్థితి. గుంటరు జిల్లాలో ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో అక్రమంగా బ్లీచింగ్ తయారీ చేసి అమ్ముతున్నారు అంటూ, నిన్న స్కాం బయట పడింది. అయితే, మంగళవారం హఠాత్తుగా ఈ యూనిట్లు మూసివేశారు. విజిలెన్స్ దాడుల భయంతో అక్రమార్కులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కరోనా విపత్తును ఆసరాగా తీసుకొని కొంతమంది నేతల సహకారంతో దారుణమైన అవినీతికి ఒడిగట్టారు. పల్నాడు ప్రాంతంలో మాత్రమే లభించే సున్నపురాయి, ముగ్గురాయి నిక్షేపాలు అక్రమార్కులు బంగారు గుడ్లు పెట్టే బాతుగా మారాయి. పల్నాడు నుంచి ప్రతిరోజూ దాదాపు రెండు వేల టన్నుల సరకు వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. అదంతా సున్నం, ముగ్గురాయి కలిపిన మిశ్రమమే. ఈ మిశ్రమం ప్యాకింగ్ చేసిన బ్యాగ్ ల పై పేరున్న కంపెనీలకు సంబంధించిన లోగోలు వేసి అమ్మేస్తున్నారు. ఈ మిశ్రమాన్ని ఒక్కొక్క టన్ను 30 వేల నుంచి 50 వేల రూపాయల వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. అంటే ప్రతిరోజూ దాదాపు 60 లక్షల నుంచి కోటి రూపాయల వ్యాపారం జరుగుతుంది. కరోనా నేపథ్యంలో అధికారులు బ్లీచింగ్ తయారీకి కొన్ని కంపెనీలకు అనుమతి ఇచ్చారు.

దానిని ఆసరాగా చేసుకొని ఆయా కంపనీల పేర్లతో భారీఎత్తున బ్లీచింగ్ తయారీకి శ్రీకారం చుట్టారు. పల్నాడు పరిసర ప్రాంతాలలో నల్లరాయి, తెల్ల రాయి నిక్షేపాలు విస్తారంగా వున్నాయి. వాటిని పిండి గా చేసేందుకు పల్నాడు ప్రాంతంలో దాదాపు రెండు వందలకు పైగా బాల్ మిల్స్ వున్నాయి. లాక్ డౌన్ కారణంగా అవన్నీ గత కొద్ది రోజులుగా మూతపడ్డాయి. ఈ పరిస్థితిని అక్రమార్కులు తమకు అనువుగా మార్చుకున్నారు. కరోనా కరవులో కాసులు పిండుకునే కుతంత్రానికి తెరతీశారు. సాధారణంగా మేలిరకం సున్నం టన్ను 3 వేల రూపాయలు, ముగ్గుటన్ను 15వందలకు లభిస్తాయి. అవి రెండూ కలిపి 25 కిలోల బ్యాగ్ లలో ప్యాకింగ్ చేస్తారు. అంటే దాదాపు 5 వేల రూపాయలు వ్యయం చేస్తే రెండు టన్నుల మిశ్రమం అందుబాటులోకి వస్తుంది. ఆ మిశ్రమాన్ని బయటి మార్కెట్ లో 60వేలనుంచి లక్ష రూపాయల వరకు విక్రయిస్తారు. అంటే ప్రతి టన్ను పై 12 నుంచి 20 రెట్లు అధికంగా లాభం వస్తుంది. ఈ మొత్తం పై వివిధ స్థాయిల్లో వాటాలు చెల్లిస్తారు. ఈ విధంగా కరోనా కరవు అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. బ్లీచింగ్ పేరుతో వివిధ ప్రాంతాలకు సరఫరా అయ్యే మిశ్రమాన్ని ప్యాక్ చేసేందుకు అవసరమైన సరంజామా అంతా పల్నాడులోనే తయారవుతుంది.

గోతాల తయారు చేసి దాని పై వివిధ కంపెనీల లోగోలను ముద్రించేందుకు అక్రమార్కులు స్వయంగా ఏర్పాట్లు చేసుకున్నారు. గోతాల పై ఇతర రాష్ట్రాలలో తయారయినట్టు పేర్లు ముద్రించి వుండటం విశేషం. కొన్నిటి పై ప్రముఖ కంపెనీ లోగో తో గుజరాత్ లో తయారయినట్టు ముద్రించారు. మరికొన్ని చోట్ల, రాజస్థాన్ లోని కోట లోనూ, ఇంకొన్ని చోట్ల ఏకంగా తైవాన్ చిరునామాలు ముద్రించి వుండటం విశేషం. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకే ప్రముఖ కంపెనీ లు, లేదా అనుమతి వున్న కంపెనీల చిరునామాలు ముద్రించి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం చేసిన తప్పు కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.29 లక్షల బస్తాల బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చెయ్యాలని నిర్ణయం తీసుకోగా, టెండర్లు పిలవకుండా, డైరెక్ట్ గా కొనటంతో, ఎవరి పనితనం వారు చూపించారు. ఇదే రకంగా, వారం రోజులు క్రితం గుడివాడలో కూడా జరిగింది. ఈ స్కాం 70 కోట్లు అని వార్తలు వస్తున్నాయి. మరి, కింద స్థాయి నుంచి, పై స్థాయి వరకు ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవాలి అనే, విచారణ చేస్తే కాని, అసలు విషయం బయట పడదు. అయితే మరీ బ్లీచింగ్ లో కూడా నొక్కేయటం పై, ప్రజలు ఆవాక్కవుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read