పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టబోయింది. కారు డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. దీంతో ఎమ్మెల్యే ఊపిరిపీల్చుకున్నారు. ఉయ్యూరు మండలం ఓగిరాలలో వివాహానికి వెళ్తున్న సమయంలో ఘటన జరిగింది. ప్రమాద వివరాలను టీడీపీ నేతలు ప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక నేతలు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదం నుంచి బయటపడిన ప్రసాద్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకున్నట్లు తెలుస్తోంది. రాత్రి వేళ ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పినట్టు సమాచారం.
ఎమ్మల్యే టికెట్ ఖరారు కావటంతో, గత కొన్ని రోజులుగా బోడె ప్రతి రోజు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే, రాత్రి వరకు ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. కొన్ని రోజులుగా జరుగుతున్న డేటా గొడవ పై కూడా బోడె స్పందించారు. వైసీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి శిఖండిలా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ధ్వజమెత్తారు. ‘సేవా మిత్ర’ అనే యాప్ ద్వారా డేటాను అప్‌డేట్ చేస్తుంటే దాన్ని సైతం రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ డేటాను కాజేసేందుకు వైసీపీ టీఆర్‌ఎస్‌తో కలిసి కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఫారం 7 పేరుతో వైసీపీ దరఖాస్తు చేసుకొని తమపై ఎదురు దాడి చేస్తోందని అన్నారు. టీడీపీకి కార్యకర్తలే బలమని, ఎవరెన్ని కుట్రలు చేసినా అవి సాగవని బోడె ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు.