విజయవాడ సబ్ కలెక్టరు మిషాసింగ్, కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మధ్య వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. సబ్ కలెక్టరు మిషాసింగ్ కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నారని కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వచ్చి ఫిర్యాదు చేశారు. నిన్న సబ్ కలెక్టర్‌తో జరిగిన వివాదంపై ముఖ్యమంత్రి సూచన మేరకు ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్రకు వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ రైతుల తరఫున రూ.లక్ష జరిమానా చెల్లించడంతోపాటు పొక్లెయినర్‌ను కూడా అధికారులకు అప్పగించడంతో వివాదం పరిష్కారమైందని చెబుతున్నారు. పుల్లేరు వివాదంపై మీడియాలో వార్తలు రావడంతో ముఖ్యమంత్రి ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఇలాంటి వివాదాలేమిటంటూ సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆదివారం ఉదయం ఆయన నివాసంలో కలుసుకున్నారు. సీఎం బిజీగా ఉండటంతో ఆయన కార్యదర్శి రాజమౌళిని కలిసి వివరించారు. ఈ వివాదానికి ఇక్కడితో పుల్‌స్టాప్ పెట్టాలని ఎమ్మెల్యేకు, సబ్ కలెక్టర్ మిషాసింగ్‌కు కూడా ఆయన సూచించినట్లు తెలిసింది.
పుల్లేరు వాగులో మట్టి తవ్వడంపై తలెత్తిన వివాదాన్ని కొనసాగించడం ఇష్టంలేకే రైతుల తరఫున జరిమానా చెల్లించానని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చెప్పారు. ముఖ్యమంత్రి కార్యదర్శి రాజమౌళిని కలిసిన అనంతరం నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వివాదం గురించి రెండు, మూడు రోజుల్లో సీఎంను కలిసి వివరిస్తానని చెప్పారు. పుల్లేరులో మట్టి తీసి రైతులు తమ పొలంగట్లకు తన్నుడు వేసుకుంటున్నారని, అక్కడ ఎలాంటి ఆక్రమణలు జరగడం లేదని పునరుద్ఘాటించారు. రైతులు తప్పు చేసినట్లు నిరూపిస్తే తాను జరిమానా చెల్లిస్తానని సబ్ కలెక్టరుకు చెప్పినా వినిపించుకోలేదని, శనివారం రాత్రి 50 మంది పోలీసులతో వచ్చి ఒక హంతకుడి ఇంట్లో తనిఖీలు చేసినట్టుగా తన కార్యాలయంలో సోదాలు నిర్వహించడం వల్లే తాను తీవ్రంగా స్పందించానని చెప్పారు. రైతులు మట్టి పనిచేస్తున్న యంత్రాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారన్న విషయం తనకు తెలియదన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అధికారుల తీరు వల్ల రైతులకు నష్టం కలగకూడదనే వారి తరఫున తాను రూ. లక్ష జరిమానా చెల్లించానని తెలిపారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని, కేసులు నమోదు చేస్తే చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు.
అసలేం జరిగిందంటే... పెనమలూరు మండలం వణుకూరు పుల్లేరు పోరంబోకు స్థలంలోని మట్టిని తీసి స్థానిక రైతులు గట్లు పటిష్టం చేస్తుండగా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారంటూ అధికారులు యంత్రాలను జప్తు చేశారు. వాటిని పోలీసు స్టేషన్‌కు తరలిస్తుండగా.. ఈ విషయం తన దృష్టికి రావడంతో వెంటనే ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అక్కడికి చేరుకున్నారు. సీజ్ చేసిన పొక్లెయిన్‌ను తన వెంట తీసుకెళ్లారు. ప్రభుత్వ అధికారులు సీజ్ చేసిన యంత్రాలను ఎమ్మెల్యే, ఎంపీపీలు బలవంతంగా ఎలా తీసుకెళ్తారంటూ సబ్ కలెక్టర్ మిషాసింగ్ నిన్న రాత్రి పుల్లేరు పోరంబోకు భూమిని స్వయంగా పరిశీలించారు. తహశీల్దారు, ఆర్‌ఐ, వీఆర్‌వోలతోపాటు పోలీసులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఎమ్మెల్యే తన కార్యాలయంలో మాట్లాడుతున్న సమయంలో అధికారులు, పోలీసులతో అక్కడి చేరుకున్న సబ్ కలెక్టరు సీజ్ చేసిన వాహనాన్ని తమకు అప్పగించాలని కోరారు. పుల్లేరు వద్ద రైతులు తప్పేమీ చేయలేదని అనవసరంగా వారిని ఇబ్బంది పెట్టొద్దని ఎమ్మెల్యే కోరారు. ఒకవేళ రైతులు తప్పు చేసినట్లు యంత్రాంగం భావిస్తే వారి తరఫున తాను జరిమానా చెల్లిస్తానని చెప్పినా సబ్ కలెక్టరు ససేమిరా అంటూ భారీ మొత్తాలను జరిమానాగా విధించారని మండిపడ్డారు. ఇది రైతులపై కక్షపూరితంగా వ్యవహరించడమేనని జరిగిన ఘటన గురించి ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శికి ఎమ్మెల్యే వెల్లడించారు. సీఎం ముఖ్య కార్యదర్శి వద్ద చర్చల అనంతరం ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శాంతించారు. రైతులకు విధించిన జరిమానా రూ.లక్ష వారి తరఫున ఎమ్మెల్యే చెల్లించటంతో వివాదానికి తెరపడింది.