ఏపీ ఓటర్ల జాబితాలో 52.67 లక్షల బోగస్ పేర్లు ఉన్నాయని పిటిషనర్ చెప్పడం తప్పుదోవ పట్టించడమేనని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తెలిపింది. పిటిషనర్ సమర్పించిన జాబితాలో 50% వివరాలు పునరావృతమయ్యాయని పేర్కొంది. ఏపీలోని ఓటర్ల జాబితాపై పిటిషనర్ లేవనెత్తిన వాదన తప్పుల తడకగా ఉందని తేల్చిచెప్పింది. జాబితాలో నకిలీ ఓట్లు ఉన్నాయనడంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టంచేసింది. రాష్ట్రంలో 52.67 లక్షల నకిలీ ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చారని, వాటిని తొలగించేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గతేడాది హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు ఈసీ దీనిపై హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది. క్షేత్రస్థాయిలో పరిశీలించాక చాలాపేర్లు వాస్తవమైనవిగా కనుగొన్నామని, వ్యాజ్యంపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేనందున పిల్‌ను కొట్టేయాలని కోరింది. సంయుక్త ఎన్నికల అధికారి ఆర్.మోహన్ జయరాం నాయక్ హైకోర్టులో ఈ మేరకు ప్రమాణపత్రం దాఖలు చేశారు.
‘నకిలీ ఓటర్ల పేర్లు తెరపైకి రావడం, వాటిని తొలగించడం నిరంతర ప్రక్రియ. మృతి చెందిన, వలస వెళ్లిన ఓటర్ల పేర్లు ఒక్కోసారి బహిర్గతమవుతాయి. నిబంధనలను అనుసరించి అలాంటి వాటిని జాబితా నుంచి తొలగిస్తాం. క్షేత్రస్థాయి పరిశీలనలో 1,28,844 పేర్లను జాబితా నుంచి తొలగించాం. అందులో నకిలీవి 31,127 ఉన్నాయి. మిగిలినవి మృతి చెందినవారి, తరలి వెళ్లిన వారి పేర్లు. జాబితాలో నకిలీ పేర్లకు తావివ్వడానికి ఫలానా వారికి దురుద్దేశం ఉందని నిరూపణ కాలేదు. ఏపీలో ఓటు హక్కు ఉండి.. తెలంగాణలో నివాసం ఉంటున్నవారు 18.50 లక్షల మంది ఉన్నారని పిటిషనర్ చెబుతున్న నేపథ్యంలో ఏపీలో చిరునామాల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేశాం. ఆ చిరునామాలో లేని వారి పేర్లను తొలగించాం’ అని ప్రమాణపత్రంలో ఈసీ పేర్కొంది.
‘తెలుగు రాష్ట్రాల్లో నకిలీ ఓటర్ల పేర్లుండే అవకాశం అతి తక్కువ. ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపు ప్రక్రియ నామినేషన్ ఉపసంహరించుకునే రోజు వరకు కొనసాగుతుంది. పిటిషనర్ ప్రతీ పేరు నమోదు(ఎంట్రీ)ని ప్రత్యేక కేసుగా పేర్కొంటూ మొత్తం 52.67 లక్షల పేర్లు నకిలీవనే నిర్ణయానికి వచ్చారు. వాటిలో 25.47 లక్షలు ఒక్కపేరు (యూనిక్) ఉన్నవిగా గుర్తించాం. మిగిలినవి పునరావృతమైనవిగా తెలుసుకున్నాం. చాలామంది తండ్రి, భర్తల పేర్లు ఒకేలా ఉన్నాయి. ఉదాహరణకు ‘నేషనల్ ఓటర్ సర్వీసు పోర్టల్’లో సుబ్రమణ్యం, తండ్రి సత్యనారాయణ అని వెదికినట్లయితే ఒక్క నియోజకవర్గంలోనే 14మంది ఓటర్ల పేర్లు వెల్లడవుతున్నాయి. ఇలాంటివన్ని బోగస్ ఓటర్లని అనడం సరికాదు’ అని తెలిపింది.