ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని బాలీవుడ్ నటి దియా మీర్జా ప్రశంసించారు. ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా కఠినంగా చట్టాలు రూపొందిస్తున్నట్లు చంద్రబాబు తాజాగా చెప్పారు. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే ప్రాణాలు పోతాయన్న భయం ప్రతి ఒక్కరిలోనూ కలగాలని స్పష్టం చేశారు. దాచేపల్లి దుర్ఘటన మానవత్వానికే మాయని మచ్చని అన్నారు. దీన్ని ఓ జాతీయ పత్రిక ప్రచురించింది. ఆ వార్తను దియా మీర్జా రీట్వీట్ చేస్తూ.. ‘నాకు మీరంటే చాలా గౌరవం. మీరు చాలా మంచి వ్యక్తి’ అని పోస్ట్ చేశారు. బాధితురాలికి ‘వ్యక్తిగతంగా చదువుకు అయ్యే ఖర్చులను నేను భరిస్తాను. తను ఉన్నత స్థానాన్ని చేరుకునే వరకు ఆమె బాధ్యతలు చేసుకుంటాను’ అని చంద్రబాబు చెప్పడం చాలా గొప్పని అభిప్రాయపడ్డారు.
మరో పక్క నిన్న చంద్రబాబు, దాచేపల్లి బాధిత బాలికను పరామర్శించారు. ‘దాచేపల్లి’ బాధిత బాలికకు తాను గార్డియన్‌గా ఉండి, ఆమె చదువు పూర్తయ్యేలా చూస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. బాధిత బాలికలు, మహిళలకు అంతా అండగా నిలబడాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ‘‘‘దాచేపల్లి’ బాలిక భవిష్యత్తు నాదే. ఇప్పటికే ప్రభుత్వపరంగా ప్రకటించిన రూ.5 లక్షల సాయానికి అదనంగా మరో రూ.5 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తాం. బాలిక తండ్రికి రెండు ఎకరాల సాగు భూమి, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం ఇస్తాం. ఆ బాలికకు గార్డియన్‌గా ఉండి.. ఎంతవరకు చదువుకొంటే అంతవరకయ్యే ఖర్చంతా స్వంతంగా భరిస్తాను. బాలిక పెద్దయ్యాక ఆమె ఆశయం నెరవేరేంత వరకు సాయం చేస్తాను’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
‘‘ఇది చాలా బాధాకరమైన సంఘటన. చెప్పడానికి కూడా సిగ్గుపడే సంఘటన. మనకే ఈ బాధ ఉంటే ఆ బాలిక తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. బాలిక తండ్రి యాత్రకు వెళ్లి ఉన్నారు. ఆయనకు విషయం చెప్పకుండా ఆరోగ్యం బాగాలేదని చెప్పి రమ్మన్నారు. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఇదొక నీచమైన, అమానవీయ సంఘటన. ప్రతి ఒక్కరూ సిగ్గుపడాలి. ఆ నీచుడిని ఎక్కడున్నా పట్టుకోమని ఆదేశాలిచ్చాను. డీజీపీ నుంచి ఎస్పీ వరకు అన్ని స్థాయిల అధికారులతో మాట్లాడి 17 బృందాలను నియమించాం. గుంటూరు జిల్లా అంతా జల్లెడ పట్టడంతో నిందితుడు పారిపోలేక ఉరి వేసుకొన్నాడు. ఇలాంటి నీచుల పట్ల ప్రతీ ఒక్కరు స్పందించడంతో పాటు ప్రతిఘటించాలి. చైతన్యం ఎంత ముఖ్యమో కాఠిన్యం కూడా అంతే ముఖ్యం. అత్యాచార కేసులను వాదించడానికి లాయర్లు అంగీకరించొద్దు’’ అని పిలుపునిచ్చారు.