అమరావతి శ్మశానమని, అక్కడ పందులు, గేదెలు తిరుగుతున్నాయి తప్ప, ఎవరూ నివాసముండటం లేదని చెప్పిన ప్రభుత్వపెద్దలు నేడు అదే అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు ఎలా ఇస్తున్నారో చెప్పాలని టీడీపీనేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నిలదీశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వహయాంలో పేదలు నిర్మించుకున్న ఇళ్లకు ఇవ్వాల్సిన రూ.1100కోట్లను ప్రభుత్వం 9నెలలైనా ఎందుకు చెల్లించడం లేదని ఉమా నిలదీశారు. పేదలు తమవంతు వాటాగా అప్పులు తెచ్చి ఇళ్లు నిర్మించుకుంటే, జగన్ ప్రభుత్వం వారిని రోడ్లపాలుచేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ధాన్యం రైతులకు చెల్లించాల్సిన బకాయిలు కేంద్రం నుంచి రాబట్టడంలో విఫలమైన జగన్ ప్రభుత్వంలోని మంత్రులు, చివరకు ఉపరాష్ట్రపతిని వేడుకునే స్థితికి దిగజారారన్నారు. ప్రభుత్వం విక్రయిస్తున్న పిచ్చిమందు (లిక్కర్)తాగి జనం చనిపోతున్నారని చెబితే, డిస్టిలరీ కంపెనీలకు జగన్ ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉందని, అవి చెల్లించడంలేదు కాబట్టి, రాష్ట్రంలో పిచ్చిమందు అమ్ముతున్నామని మరో మంత్రి నిస్సిగ్గుగా సమాధానంచెబుతున్నాడని బొండా మండిపడ్డారు.
డిస్టిలరీలకు చెల్లించాల్సిన రూ.1600కోట్లను వాడుకున్న ప్రభుత్వం, ఆమొత్తం రుణంగా ఇవ్వమంటూ ప్రపంచబ్యాంక్ ని అడగటం సిగ్గుచేటన్నారు. ఇటువంటి దారుణాలు ఈ రాష్ట్రంలో తప్పమరెక్కడా ఉండవని, ఇటువంటి తుగ్లక్ చర్యలను కూడా మరెక్కడా చూడబోమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పేదలకు ఇవ్వడానికి ఏజిల్లాలో ఎంతెంతభూమి కొన్నదో, ఎన్ని వేలఎకరాలు పంచిందో వెల్లడించాలని బొండా డిమాండ్ చేశారు. 26లక్షల మందికి ఇవ్వడానికి అవసరమైన 25వేల ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళికలేమిటో, ఎకరం ఎంతచొప్పున కొని, పేదలకు పంచుతున్నారో పూర్తివివరాలు బయటపెట్టాలని, దానిపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చించడానికి టీడీపీ సిద్ధంగా ఉందని ఉమా తేల్చిచెప్పారు. జగన్ ప్రభుత్వం సాగిస్తున్న మద్యం మాఫియాపై రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు వెల్లడించడానికే, ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్న కల్తీమద్యం సీసాలను తాము విలేకరుల సమావేశంలో చూపించామని బొండా స్పష్టంచేశారు. తాము అడిగిన వివరాలపై సమాధానం చెప్పకుండా నోటికొచ్చినట్లు పిచ్చిపిచ్చిగా రోజానో, మరొకరో మాట్లాడితే వాస్తవాలు అవాస్తవాలు కావన్నారు. జే-ట్యాక్స్ వసూలు తట్టుకోలేక ప్రధానమైన డిస్టిలరీ కంపెనీలన్నీ మద్యం సరఫరా చేయకుండా చేతులెత్తేశాయన్నారు.
చీప్ లిక్కర్ పై క్వార్టర్ కు అదనంగా వసూలుచేస్తున్న రూ.100రూపాయలు ఎవరి జేబులోకి వెళుతోందో వైసీపీ మంత్రులు సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలోని ఎక్సైజ్ మంత్రి సెక్రటేరియట్ లో, మందు బాటిళ్లుచూపి విలేకరులతో మాట్లాడాడన్నారు. మద్యం వ్యాపారాన్ని నియంత్రించాల్సిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలోని మహిళా సిబ్బందితోనే మందు అమ్మిస్తున్న ప్రభుత్వనిర్వాకంపై రోజా ఏం సమాధానం చెబుతుందని ఉమా నిలదీశారు. పక్కరాష్ట్రాల నుంచి వస్తున్న ఎన్ డీపీ లిక్కర్ ని వాలంటీర్లే డోర్ డెలివరీ చేస్తున్నారని, అదిచాలక గ్రామాల్లో నాటుసారా విక్రయాలు యథేచ్చగా సాగిస్తున్నారని, వీటన్నింటిపై నోరువిప్పే, దమ్ము, ధైర్యం రోజాకుగానీ, ఇతర మంత్రులకుగానీ లేదన్నారు. సిగ్గులేకుండా ఇంకా ఆంధ్రప్రదేశ్ లోని తాగుబోతులకోసం ప్రపంచబ్యాంక్ రుణమిస్తుందని చెప్పడం జగన్ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ప్రభుత్వలోపాలను ఎత్తిచూపుతున్న ప్రతిపక్షంపై దుమ్మెత్తిపోసినంత మాత్రాన వాస్తవాలు ప్రజలకు తెలియకుండా పోతాయని భావిస్తే, అంతకంటే ఆత్మవంచన మరోటి ఉండబోదన్నారు. ప్రతిపక్షం ఎత్తిచూపిన తప్పులు సరిదిద్దుకోకుండా, కేసులుపెడతాం.. అంతుతేలుస్తామంటూ సొల్లు కబుర్లు చెప్పి, డాంభికాలుప్రదర్శిస్తే భయపడేవారెవరూ లేరని బొండా తేల్చిచెప్పారు.