తెలుగుదేశం పార్టీ ఓటమి చెందిన తరువాత, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీని బలహీనపరిచి, ఆ స్థానం ఆక్రమించుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా, ఇప్పటికే రాజ్యసభ అభ్యర్ధులను లాగేసుకున్నారు. దాదపుగా 75 మంది నేతల కోసం, బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. కొంత మంది ఇప్పటికే కాషాయం కండువా కప్పుకున్నారు కూడా. ఒక పక్క చంద్రబాబు, ఓటమి పై సీనియర్ నేతలతో భేటీ అయ్యి, సమీక్షలు చేస్తుంటే, ఇక్కడ కొంత మంది నేతలు మాత్రం, అటు ఇటుగా ఉంటున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గానికి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు మాటి మాటికీ భేటీ అవ్వటం, బీజేపీలోకి వెళ్తున్నాం అని మీడియాకు లీకలు ఇవ్వటం, మీడియా ముందుకు వచ్చి, అదేమీ లేదు అని చెప్పటం, జరుగుతూ వస్తుంది. ఈ నేపధ్యంలో, ఈ రోజు మరోసారి తెలుగుదేశం పార్టీ కాపు నేతలు అంతా, సమావేశం అవుతున్నారు. బొండా ఉమా ఇంట్లో, ఈ రోజు లంచ్ మీటింగ్ కు కాపు నేతలంతా వచ్చారు .
కాకినాడలో జరిగిన సమావేశం తర్వాత కాపునేతలు అంతా, ఇలా భేటీ అవ్వటం, రెండోసారి. ఇది ఇలా ఉంటే, కాపు నేతలు అందరినీ చంద్రబాబు ఈ రోజు సాయంత్రం రమ్మన్నారు. చంద్రబాబుతో ఏమి మాట్లాడాలి అనే విషయం పై బొండా ఉమా ఇంట్లో అందరూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బొండా ఉమా, మీడియాతో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేము పార్టీ మారుతున్నాం అనే వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. మేము భేటీ అవుతుంది, పార్టీ మారటానికి కాదని, అలా అనుకుంటే, ఇన్ని మీటింగ్ లు అవసరం లేదని, ఒకేసారి మారిపోయే వాళ్ళమని బొండా ఉమా అన్నారు. మేము పార్టీ నుంచి మాకు ఎదురవుతున్న ఇబ్బందులు, కొంత మంది నుంచి సరైన సహకారం అందక పోవటం వంటి అంశాల పై మాత్రమే చర్చించామని అన్నారు. పార్టీలోని కొంత మని వల్ల మాకు ఇబ్బందులు వచ్చాయని, అవన్నీ చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఈ సమస్యలు అన్నిటి పై చంద్రబాబుతో చర్చిస్తామని, పార్టీ అధినేతగా ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం అని, చంద్రబాబు స్పందనను బట్టి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.