2019 ఎన్నికలు ముగుసిన దగ్గర నుంచి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం నాయకుడు బొండా ఉమా వ్యవహార శైలి, పార్టీకి దూరం అవుతునట్టే ఉంది. చంద్రబాబు విదేశాల్లో ఉన్న టైంలో, కాపు మీటింగ్లు పెట్టటం, చంద్రబాబు తిరిగి వచ్చిన తరువాత సమీక్షలకు రాకుండా అలగటం, చంద్రబాబు ఫోన్ చేసిన తరువాత, ఆయన దగ్గరకు వెళ్లి కలవటం, మళ్ళీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా వెళ్ళిపోవటం చూస్తుంటే, బొండా ఉమా పార్టీ మార్పు తధ్యంగానే కనిపిస్తుంది. నెల రోజుల క్రిందట చంద్రబాబుతో మాట్లాడిన బొండా ఉమా, తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని చెప్పి వెళ్ళిపోయారు. అయితే అప్పటి నుంచి ఆక్టివ్ గా లేరు. ఆయన విదేశాలకు విహార యాత్రలకు వెళ్ళిపోయారు. అయితే ఆయన విహార యాత్రలకు వెళ్ళినా, రాజకీయంగా మాత్రం హాట్ టాపిక్ గానే ఉంటున్నారు.
వారం రోజుల నుంచి బొండా ఉమా, వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం ఊపందుకుంటుంది. ఆయన ఇప్పటికే వైసీపీతో చర్చలు జరిపారని, విజయవాడ తూర్పు ఇంచార్జ్ బాధ్యతలు ఇస్తారనే సమాచారం వస్తుంది. తూర్పులో ప్రస్తుతం వైసీపీకి సరైన కాండిడేట్ లేరు. గద్దె రామ్మోహన్ ను ఎదుర్కునే వారి కోసం వైసీపీ చూస్తుంది. ఇంతక ముందు రాధా ఉన్నా,ఆయన తెలుగుదేశంలో చేరిపోయారు. మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన బొప్పన భవ కుమార్ అంత ఆక్టివ్ గా పాలిటిక్స్ లో ఉండరు. ఇక యలమంచలి రవి కూడా దూరంగానే ఉంటున్నారు. ఈ నేపధ్యంలో, కాపు సామాజికవర్గ నేత అయిన బొండా ఉమా వైసీపీలోకి వచ్చి తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే, కృష్ణలంక వోటింగ్ మొత్తం బొండా ఉమాకు పడుతుంది అనేది వైసీపీ ఆలోచన. బొండా ఉమా కూడా ఈ ప్రతిపాదనకు ఒప్పుకునట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నారు.
అక్కడ నుంచి రాగానే, దీని పై క్లారిటీ ఇస్తారని తెలుస్తుంది. అయితే, ఈ లోపే బొండా ఉమా పెట్టిన ఒక ఫేస్బుక్ పోస్ట్ మాత్రం, ఆయన పార్టీ మార్పు ఖాయం అనే మాట వినిపిస్తుంది. బొండా ఉమా బంగీ జంప్ చేసిన వీడియో పోస్ట్ చేస్తూ, ‘హలో బెజవాడ..! నా తర్వాత రాజకీయ అడుగుపై చర్చ జరుగుతున్న తరుణంలో వేయబోతున్న సాహస, ధైర్యవంతమైన అడుగు ఇలా ఉండబోతోంది..!’ అంటూ ట్వీట్ చేసారు. అంటే, ఆయన తరువాత అడుగు కచ్చితంగా ఎదో ఉంటుంది అనే విధంగానే ఆ పోస్ట్ ఉంది. అయితే దీని పై నెటిజెన్ లు కూడా అలాగే స్పందిస్తున్నారు. మీరు రివర్స్ లో దూకుతున్నారు, మీ అడుగు కూడా ఇలాగే రివర్స్ లో, రివెర్స్ పార్టీలోకే అన్నట్టు ఉంది అంటూ ఒకరు, అలాగే ఇది చాల డేంజర్ స్టంట్, అంటే మీరు కూడా డేంజర్ జోన్ లోకి అడుగు పెడుతున్నారా అంటూ మరో కామెంట్ పెడుతున్నారు. బొండా ఉమా నోరు తెరిస్తే కాని, అసలు విషయం ఏంటో తెలియదు.