తెలుగుదేశం పార్టీ ఓటమిని గత నెల రోజులుగా ఎవరికి తోచింది వాళ్ళు విశ్లేషిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇదే బలామైన కారణం అంటూ బల్ల బద్దులు కొట్టి చెప్తున్నారు. ఎన్నికల్ ఫలితాలు వచ్చిన తరువాత టిడిపి అధినేత చంద్రబాబు కూడా వివిధ రకాల సమీక్షలు చేస్తూ, ఓటమి కారణాలు విశ్లేషిస్తున్నారు. నేతల దగ్గర నుంచి, గ్రామ స్థాయి కార్యకర్తల వరకు, వారి నుండి అభిప్రాయాలూ తెలుసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్తూ, తమ దృష్తిలో ఎక్కడ తప్పు జరిగింది అనే విషయం చంద్రబాబు ముందు కుండ బద్దలు కొడుతున్నారు. తాజాగా ఓటమి పై విశ్లేషిస్తూ, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. సొంత పార్టీ నేతలను కూడా వదలకుండా, ఓటమికి గల కారణాలను చెప్పారు. నిన్న ఒక మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బొండా ఉమా ఈ వ్యాఖ్యలు చేసారు. ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ ప్రశాంత్ కిషోర్ టీమ్ చేసిన ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్ళింది అని, అది బాగా ప్రభావితం చేసిందని అభిప్రాయపడ్డారు. ఈ ఒక్క నినాదమే తెలుగుదేశం పార్టీ ఓటమికి ఓ బలమైన కారణంగా చెప్పారు.
ఇక సొంత పార్టీ నేతలను కూడా బొండా ఉమా వదల్లేదు. కొంతమంది మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు, చంద్రబాబు వద్ద ప్రతీదానికి భజన చేసి, పార్టీ ఇలా అవ్వటానికి కారణం అయ్యారని బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని మంచి పనులు, పధకాలు, అభివృద్ధి చేసినా, గ్రౌండ్ లెవెల్ లో ఉన్న వాస్తవాలను తమ అధినేత దృష్టికి తీసుకెళ్లకుండా, అదే విధంగా కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, వారి మనోభావాలు ఏంటి అనేది చంద్రబాబుకు తెలియకుండా, ప్రతి విషయానికి భజన చేస్తూ ఆ మంత్రులు చేసిన అతి, ఈ పరిస్థితికి తెచ్చిందని వ్యాఖ్యానించారు. మరో పక్క తాను పార్టీ మారుతున్నాను అంటూ చేసిన ప్రచారం ఖండించారు. కాపు నేతలు అంతా, ఎందుకు ఓడాం అని విషయం సమీక్ష చేసుకుని, పార్టీని బలపరచటానికి సమావేశం అయ్యామని చెప్పారు. బీజేపీలోకి, వైసీపీలోకి వెళ్ళే పరిస్థితి లేదని, జనసేనలోకి మేమే కాదు, మా కార్ డ్రైవర్ కూడా వెళ్ళడు అంటూ బొండా ఉమా వ్యాఖ్యలు చేసారు.