వైసీపీ అధినేత జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడికి యత్నించిన యువకుడిని పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జగన్ చికిత్స పొందుతున్నారు. మరోవైపు, ఈ దాడికి సంబంధించి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను హైకోర్టు కాసేపట్లో విచారించనుంది. ఈ పిటిషన్‌ను బోరుగడ్డ అనిల్ కుమార్, అమర్‌నాథ్‌రెడ్డి దాఖలు చేశారు. సీఎస్‌ఎఫ్ అధికారుల రిపోర్టు తీసుకోవాలని దాడి ఘటన మొత్తం సీబీఐ చేత విచారణ చేయించాలని పిటిషనర్లు కోరుతున్నారు. కాగా ఈ దాడి ఘటనపై లంచ్‌మోషన్‌లో హైకోర్టు విచారించనుంది. అయితే కోర్టు ఏం చెప్పబోతోందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయితే ఈ పిటీషన్ దాఖలు చేసిన బోరుగడ్డ అనిల్ కుమార్, టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులకు సన్నిహితుడు. రమణదీక్షితుల ఆరోపణలకు మద్దతుగా ఆయనతో కలిసి ప్రెస్ మీట్ లో కూర్చున్నాడు. క్రైస్తవ మత ప్రచారంలో చురుగ్గా పాల్గొనే బోరుగడ్డ అనిల్‌తో కలిసి రమణ దీక్షితులు హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ అప్పట్లో సెన్సేషన్ అయిన సంగతి తెలిసిందే. అనిల్, జగన్ బంధువుగా కూడా ప్రచారం చేసుకుంటూ ఉంటాడు. ‘మా పిన్నమ్మ జగన్‌కు బంధువు’ అని అనిల్ పేర్కొంటారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఓ క్రైస్తవ సంస్థ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పత్రికలకు ఫొటోలు పంపుతుంటారు. జగన్ బావమరిదిని అని చెప్పుకుంటూ, వైఎస్ వై. యెస్. వివేకానంద రెడ్డికి మేనల్లుడు వరుస అని కూడా చెప్పుకుంటూ తిరుగుతాడు.
ఇప్పటి వరకు వైఎస్ ఫ్యామిలీ ఈ ప్రచారాన్ని ఖండించలేదని, వైఎస్ ఫ్యామిలీకి ఈయన బంధువు అని చెప్పటానికి ఇదే నిదర్శనం అని అంటున్నారు. ఇప్పుడు ఏకంగా, జగన్ కు మద్దతుగా పిల్ వేసాడు. ఇంతకు ముందు తిరుపతి కుట్ర, ఇప్పుడు ఇలా, ఈ డాట్స్ అన్నీ కనెక్ట్ చేస్తే, వీళ్ళ వెనుక ఉన్న స్టొరీ ఇట్టే అర్ధమైపోతుంది. మరోవైపు, ఈ ఘటన నేపథ్యంలో, నేటి సీబీఐ కోర్టు విచారణకు జగన్ హాజరుకాలేకపోయారు. గురువారం మధ్యాహ్నం నుంచి జగన్ ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇవాళ ఒక్క రోజు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ తరపు న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందుకు స్పందించిన సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చింది.