అమరావతి అనే పేరు వింటేనే, మొదటి నుంచి వైసిపీ పార్టీకి వ్యతిరేకత. అమరావతిని అన్ని విధాలుగా చంద్రబాబు పైకి తేవాలని, ప్రపంచంలోనే మేటి నగరాల్లో ఒకటిగా అమరావతిని నిలపాలని కలలు కన్నారు. దీనికి అక్కడ ప్రజలు కూడా సహకరించి, ఒక్క రక్తం బొట్టు కూడా చిందకుండా, 33 వేల ఎకరాలు ఇచ్చారు. ఇంత భూమి ప్రజలు, ప్రభుత్వానికి ఇవ్వటం, ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ప్రణాళికలు తగ్గట్టుగానే, రోడ్లు వేసారు, ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ ల క్వార్టర్స్ నిర్మాణం పూర్తయింది. మరిన్ని నిర్మాణంలో ఉన్నాయి. శాశ్వత సచివాలయం, హైకోర్ట్ పనులు మొదలయ్యాయి. అయితే, ఈ నిర్మాణాలు జరుగుతున్నంత సేపు, వైఎస్ఆర్ పార్టీ, చివరకు జగన్ కూడా, అమరావతిని భ్రమరావతి అంటూ హేళన చేసారు. ఇక సాక్షిలో వచ్చిన కధనాలు అయితే, కోకొల్లలు. ఇలాంటి టైంలోనే, ప్రభుత్వం మారింది.
జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అమరావతి నిర్మాణాలు ఆగిపోయాయి. అమరావతిని బూచిగా చూపించే ప్రతి సందర్భాన్ని వాడుకునే వైసిపీ పార్టీ, ఇప్పుడు మొన్న వచ్చిన వరదలను కూడా అలాగే వాడుకుంటుంది. మొన్న వరదలు ఎలా వచ్చాయో అందరికీ తెలుసు. 20 రోజుల నుంచి వరద వస్తున్నా, సరైన వాటర్ మ్యానేజ్మెంట్ చెయ్యటం చేత కాక, కృష్ణా పరివాహక గ్రామాలను ముంచారు. అయితే ఇంత చేసినా, అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలోకి వరదలు రాలేదు. ఎక్కడో 30 కిమీ దూరంలో ఉన్న అమరావతి గ్రామం మునిగితే, అది అమరావతి రాజధాని ప్రాంతం అని ప్రచారం చేసారు. అయితే ఈ ప్రచారాల మధ్యే, ఇప్పుడు ప్రభుత్వం తరుపున, మంత్రి బొత్సా మరో బాంబు పేల్చారు. రాజధాని పై కీలక వ్యాఖ్యలు చేసారు. రాజధాని పై ప్రభుత్వంలో చర్చ జరుగుతుందని అన్నారు.
విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధాని పై త్వరలోనే ఒక ప్రకటన చేస్తామని అన్నారు. ఆ ప్రకటనలో పూర్తీ వివరాలు అందచేస్తామని అన్నారు. అమరావతి ప్రాంతంలో నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందని అన్నారు. బయట నిర్మాణాల కంటే, ఇక్కడ ఎక్కువ వ్యయం అవుతుందని బొత్సా అన్నారు. మొన్న వరదలతో, ఇక్కడ ప్రాంతం మునిగిపోతుందని అర్ధమవుతుందని అన్నారు. ఈ వరదలు రాకుండా చెయ్యాలి అంటే, కాల్వలు, డ్యామ్‌లు నిర్మించాల్సి ఉంటుందని, ఇది ప్రభుత్వానికి ఒక అదనపు భారం అని, ప్రజాధనం వృధా అవుతుందని బొత్సా అన్నారు. అందుకే ఇవన్నీ ఆలోచిస్తున్నామని అన్నారు. అయితే బొత్సా ప్రకటన విశ్లేషిస్తే, రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారా అనే అర్ధం వచ్చేలా ఉంది. ప్రజా ధనం వృధా అవుతుంది, చర్చిస్తున్నాం అంటున్నారు. మరో పక్క నిర్మాణాలు అన్నీ ఆపేశారు. ఇవన్నీ చూస్తుంటే, చంద్రబాబు మీద కోపంతో, మరో షాకింగ్ నిర్ణయం, త్వరలోనే ఏపి ప్రజలు వినబోతున్నారు అనిపిస్తుంది. వేచి చూద్దాం..