వైసీపీ మంత్రులు సోయలో ఉండి మాట్లాడుతున్నారో, లేక కావాలని మాట్లాడుతున్నారో, లేక తమ అధినేతను మంచి చేసుకోవటానికి మాట్లాడుతున్నారో కానీ, వారు మాట్లాడే మాటలు అసంబద్ధంగా, ఆలోచన లేకుండా ఉంటున్నాయి. మొన్నటి దాకా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే, అమరావతి అని అందరూ చెప్పే వారు. ఇప్పుడు అమరావతి అనే మాటే లేకుండా పోయింది. మూడు ముక్కలు చేసి పెట్టారు. ఒక విధానం లేకుండా చేసి పడేసారు. మళ్ళీ బిల్లు వెనక్కు తీసుకున్నారు. అసలు వీరికి మనసులో ఏమి ఉందో, అసలు ఏమి చేద్దాం అనుకుంటున్నారో తెలియదు. అప్పట్లో ఒక వీడియో వైరల్ అయ్యింది. అందులో బొత్సాని విలేఖరులు, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే, అయన తడబడిన తీరు అందరికీ నవ్వులు తెప్పించింది. ఒక మంత్రికి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదో తెలియకుండా, ఆయన పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అయితే ఇప్పుడు బొత్సాకి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా, ఈ రోజు విలేఖరులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ అంటూ బాంబు పేల్చారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం, 2024 వరకు మనకు హైదరాబాద్ రాజధాని అని, అప్పటి వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ అంటూ బొత్సా చేసిన వ్యాఖ్యలు అందరికీ షాక్ కు గురి చేసాయి.
ఏ రాష్ట్రానికి, ఆ రాష్ట్రం విడిపోయి, తెలంగాణా వాళ్ళు తిట్టే తిట్లకు సమాధానంగా, ఆత్మగౌరవంతో, హైదరాబాద్ కు ధీటైన రాజధాని నిర్మించుకుందామని, అమరావతిని రాజధానిగా ఏపి నిర్ణయం తీసుకుంది. ఇందులో వైసీపీ కూడా భాగస్వాములే. అమరావతిని ఒకే అన్నారు. అమరావతిలో జగన్ కు ఇల్లు ఉంది, మేమే రాజధాని కట్టి చూపిస్తాం అన్నారు, మొత్తం చెప్పి, చివరకు అమరావతితో మాకు సంబంధం లేదని అంటున్నారు. ఇప్పుడు అమరావతి మన రాజధాని కాదు, మూడు రాజధానులు కుడా కాదు, మన రాజధాని హైదరాబాద్ అంటూ బొత్సా ఈ రోజు చేసిన ప్రకటనతో అందరూ షాక్ తిన్నారు. అయితే బొత్సా మాటల పై టిడిపి మండి పడుతుంది. కేసిఆర్ కు బానిసత్వం చేస్తున్న వైసీపీ నేతలు, ఇప్పుడు తమ మనసులో మాట బయట పెట్టారని, కేసీఆర్ రుణం తీర్చుకునేందుకు ఏపీని నాశనం చేస్తున్నారని, హైదరాబాద్ పురోగతికి కృషిచేసిన మంత్రులు మనసులో మాట బయటపెట్టారని, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు.