మూడు రాజధానుల పై, బోస్టన కమిటీ, జీఎన్ రావు కమిటీ నివేదికల పై ఏర్పాటు అయిన, హైపవర్ కమిటీ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా, మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, తాము తయారు చేసిన హై పవర్ కమిటీ నివేదికను జగన్ మోహన్ రెడ్డికి అందచేసినట్టు చెప్పారు. రేపు జరగబోయే క్యాబినెట్ మీటింగ్ లో, ఈ నివేదిక పై చర్చిస్తామని చెప్పారు. హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చిన నేపధ్యంలో, ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. అమరావతిలో జరుగుతున్న రైతుల ఉద్యమం పై, వారి అభ్యంతరాల పై, జగన్ దృష్టికి తీసుకు వెళ్ళమని, అమరావతి రైతులకు న్యాయం జరిగేలా చూడమని, జగన్ చెప్పారని, బొత్సా అన్నారు. అలాగే సీఆర్డీఏ చట్టం రద్దు గురించి వార్తలు వస్తున్నాయి కదా, ఇది నిజమేనా అని మీడియా ప్రశ్నించగా. సీఆర్డీఏ చట్టం రద్దు విషయం, అసలు తమ ద్రుష్టిలో లేదని బొత్సా అన్నారు. అలాగే, తమ హైపవర్ కమిటీ ఈమెయిల్‌ను ఎవరో హ్యాక్ చేశారని బొత్స ఆరోపించారు.
కొంత మంది అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు తమను కలిసారని, వారి సమస్యలు చెప్పారని బొత్సా చెప్పారు. ఇక అన్నిటికంటే కీలకమైన విషయం, గత రెండు రోజులుగా చర్చలో ఉన్న విషయం, అమరావతి పై ఐఐటీ మద్రాస్ నివేదిక. ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన ఐఐటీ మద్రాస్ నివేదిక తప్పు అని, ఐఐటీ మద్రాస్ చెప్పటంతో, ప్రభుత్వం కూడా ఈ రిపోర్ట్ గురించి చెప్తూ ఉండటంతో, అసలు ఐఐటీ మద్రాస్ నివేదిక అనేది లేదని, ఇది ఫేక్ అంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయం పై ఈ రోజు విలేఖరులు, బొత్సాని అడిగారు. మీరు చెప్తున్న ఐఐటీ మద్రాస్ నివేదిక ఫేక్ కదా అంటే, అని బొత్సాని అడగగా, మంత్రి బొత్సా ఈ విషయం పై, ఎక్కడా నెరుగా సమాధానం చెప్పకుండా, తప్పించుకున్నారు.
"కావాలంటే మీరు కూడా చెన్నై ఐఐటీకి మెయిల్ పెట్టుకోండి. మేం చెప్పేవన్నీ అబద్ధాలే అంటారా? శివరామకృష్ణన్ కమిటీ నివేదిక కూడా అబద్ధమేనా?’ అంటూ మీడియా ప్రతినిధులను ఆయన ఎదురు ప్రశ్నించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలపై తానేం మాట్లాడగలను? " అంటూ ఎదురు మీడియానే ప్రశ్నించి, అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పలేదు. అలాగే ఒక విలేఖరి, అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని ప్రశ్నించగా, దాని పై బొత్సా ఫైర్ అయ్యారు. ఇదే విషయాన్ని మీరు ఎప్పుడైనా, చంద్రబాబుని అడిగారా? అంటూ ఎదురు వారి పైనే చిందులు వేసారు. విలేఖరులు అడిగిన ప్రశ్నలకు, బొత్సా ఇబ్బంది పడుతూ సమాధానం ఇచ్చారు. మొత్తానికి, ఏది నిజమో, ఏది కాదో కూడా తెలియని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది.