వైసీపీ కీలకనేత వంగవీటి రాధాకృష్ణ గత కొన్నిరోజులుగా అధిష్టానంపై అలకబూనిన సంగతి తెలిసిందే. విజయవాడ సెంట్రల్ సీటును నిరాకరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. విజయవాడ తూర్పునుంచి పోటీ చేయాలని ఆదేశించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన రాధా పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆఖరికి వైఎస్ జగన్ పాదయాత్ర ముగింపునకు ఇచ్ఛాపురానికి కూడా వెళ్లలేదు. దీంతో అప్పట్లో ఆయన వైసీపీని వీడి జనసేన కండువా కప్పుకుంటారని కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకూ ఆయన ఈ విషయమై మీడియా ముందుకు రాలేదు.
పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలుసుకుని అలెర్టయిన వైసీపీ అధిష్టానం రాధాతో మంతనాలు ప్రారంభించింది. ఆదివారం సాయంత్రం వైసీపీ సీనియర్ బొత్స సత్యనారాయణ.. వంగవీటి రాధాతో భేటీ అయ్యారు. సుమారు అరగంటకు పైగా టికెట్‌తో పాటు పలువిషయాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని రాధాను బొత్స కోరినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో తాను తూర్పునుంచి పోటీ చేయనని తేల్చిచెప్పారని సమాచారం. అయితే ఇదే విషయం జగన్ తో బొత్సా చెప్పగా, అవేమీ కుదరవు అని, ఆ నిర్ణయాలు అన్నీ అయిపోయాయని, జగన్ తేల్చి చెప్పటం, అలాగే కొన్ని అవమానకర మాటలు మాట్లాడటంతో, రాధా ఉన్నట్టు ఉండి, వైసీపీన్ వీడాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇక మీతో మాట్లాడేది ఏమి లేదు, మీరు బయలుదేరండి, కొద్ది సేపట్లో టీవీలో వార్తలు చూడండి అని బొత్సాకు తేల్చి చెప్పారు, రాధా. దీంతో బొత్సా, జగన్ కు, విజయసాయి రెడ్డికి ఇక చేసేది ఏమి లేదని, పరిస్థితి చేయి దాటిపోయిందని, చెప్పినట్టు సమాచారం. అన్నట్టుగా, రాధా వెంటనే రాజీనామాను ప్రకటించారు. ఈ భేటీ అయిన అరగంటకే రాధా రాజీనామా చేయడం గమనార్హం. రాధా ఏ పార్టీలో చేరతారనే విషయంపై ఇంత వరకూ స్పష్టత రాలేదు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్‌కు పంపించారు. రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన కార్యాచరణ రెండు రోజుల్లో వెల్లడిస్తానని తెలిపారు. రాజీనామాకు కారణాలేంటన్నదానిపై స్పష్టత ఇస్తానన్నారు. ఈ రెండు రోజులు సహకరించాలని అభిమానులను, అనుచరులను కోరారు. తనది ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే మనస్తత్వం కాదన్నారు.