గతఎన్నికల్లో ఒక్కసారి.... ఒక్కసారి అని ప్రజలను బతిమాలి వారి ఓట్లేయించుకున్న జగన్, ఇప్పుడు ఇంకోసారి అంటూ వారి ముందుకెళుతున్నాడని, గతంలో ఆయన్ని నమ్మిన వారంతా, మరోమారు ఆయన్ని నమ్మడానికి సిద్ధంగా లేరని టీడీపీనేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పష్టంచేశారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఒక అవకాశమిచ్చి నిట్టనిలువునా మోసపోయిన ప్రజలంతా, జగన్ కు మరో అవకాశమివ్వడానికి సిద్ధంగా లేరని, ఆయన కల్లబొల్లి మాటలు నమ్మి, మరోసారి తమ భవిష్యత్ ను సర్వనాశనం చేసుకునేందుకు వారెవరూ ఇష్టపడటంలేదని బుద్దా తెలిపారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయా... జగన్ కు ఎప్పుడు బుద్ధిచెబుదామా అని రాష్ట్రప్రజలంతా ఎదురుచూస్తున్నారన్నారు. తనపార్టీ ఎంపీ, ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న, జగన్ నివాసముంటున్న ప్రాంతమైన అమరావతిలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతుందో సమాధానం చెప్పాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ అవసరమైన రాజధాని ప్రాంతవాసుల ఓట్లు, స్థానిక ఎన్నికలు వచ్చేసరికి పనికిరాకుండా పోయాయా అని బుద్దా నిలదీశారు. జగన్ కు ఓటమి భయం పట్టుకోబట్టే, రాజధాని ప్రాంతంలోని 3 మండలాల్లో ఎన్నికలు వాయిదా వేశాడన్నారు. కేవలం ఆ ప్రాంతంలోనే తనపై వ్యతిరేకత ఉందని జగన్ భావిస్తున్నాడని, రాష్ట్రమంతా ఆయనకు వ్యతిరేకపవనాలు వీస్తున్నాయన్న విషయం ఎన్నికల ఫలితాల నాటికి ముఖ్యమంత్రికి బోధపడుతుందన్నారు. 175 నియోజకవర్గాల్లో జగన్ పై వ్యతిరేకత ఉందని, అలాంటప్పుడు రాష్ట్రమంతా ఎన్నికలు ఆపేస్తే మంచిదన్నారు.
టీడీపీకి ఓటేస్తే, పింఛన్లు ఇవ్వము.. రేషన్ ఆపేస్తాము, ఇళ్లు ఇవ్వమంటూ జగన్ ప్రభుత్వం వాలంటీర్లద్వారా బెదిరిస్తోందన్నారు. ప్రజలసొమ్ము ప్రజలకు ఇవ్వడానికి జగన్ ప్రభుత్వ బెదిరింపులేంటని వెంకన్న నిలదీశారు. జగన్ దృష్టిలో బీసీలంటే, వాడుకొని వదిలేసేవాళ్లని, అందుకనుగుణంగానే రిజర్వేషన్లు సహా, అనేక అంశాల్లో వారికి మొండిచెయ్యే చూపాడన్నారు. ఎన్నికల నిర్వహణకోసం 13 జిల్లాలకు ఇన్ ఛార్జ్ లను నియమించిన జగన్ ప్రభుత్వం, బీసీలకు ఎందుకివ్వలేదన్నారు. కాపులు, బీసీలగురించి మాట్లాడే అర్హత జగన్ కు లేనేలేదని బుద్దా స్పష్టంచేశారు. చంద్రబాబునాయుడు కాపురిజర్వేషన్లను అసెంబ్లీలో అమోదించి, కేంద్రానికి పంపితే వాటి గురించి జగన్ ఒక్కనాడైనా కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. బీసీలకు ఉన్న రిజర్వేషన్లే పీకేసిన జగన్, కాపులకు వాటిని అమలుచేస్తాడనుకోవడం అత్యాశే అవుతుందన్నారు. బీసీల రిజర్వేషన్లలో కోతపడితే, వారికి న్యాయం చేయడం కోసం టీడీపీ సుప్రీంకోర్టుకెళితే, దాన్నికూడా తప్పుపట్టడం జగన్ కే చెల్లిందన్నారు. సుప్రీం తీర్పు వచ్చేవరకు ఆగకుంగా జగన్ హడావుడిగా ఎన్నికలకు వెళ్లడంద్వారా బీసీలకు అన్యాయం చేశాడన్నారు. ప్రజలు తనపక్షాన లేరని తెలుసుకున్న జగన్, వారిని గందరగోళపరుస్తూ, పోలీసులను, ఇతర అధికారులను అడ్డుపెట్టుకొని, స్థానిక ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడన్నారు.
జగన్ కు పోలీసులపై ఉన్న విశ్వాసం, నమ్మకం ప్రజలపై లేకుండా పోయాయన్నారు. డబ్బు, అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నికల్లో గెలవడం కోసం జగన్ తెగ ఆరాటపడుతున్నాడన్నారు. తన ఇల్లు, తన కార్యాలయం ఉన్న ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించలేని దుస్థితిలోఉన్న జగన్, రాష్ట్రమంతా ఎన్నికలు పెట్టాలని చూస్తున్నాడని బుద్దా ఎద్దేవాచేశారు. ఇంట్లో గెలవలేని జగన్, రాష్ట్రంలో గెలుద్దామనుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో జగన్ చేసిన, చేస్తున్న దుర్మార్గపు పనులు, ఏ ముఖ్యమంత్రి చేయలేదని వెంకన్న మండిపడ్డారు. రాష్ట్రప్రజలంతా జగన్ ఎప్పుడు ముఖ్యమంత్రి పీఠంపై నుంచి దిగుతాడా అని ఎదురుచూస్తున్నారన్నారు. రాష్ట్ర ఖజానా నుంచి లక్షకోట్లు దోచుకోవాలని ఎదురుచూస్తున్న విజయసాయి రెడ్డి, ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజలకు వెళుతున్న సొమ్ము, తిరిగి తమజేబుల్లోకే వచ్చేలా ప్రణాళికలు వేస్తున్నాడన్నారు. ప్రజలు తమసొమ్మంతా నిత్యావసరవస్తువులు, లిక్కర్ (మందు), పెంచిన ధరలకు వెచ్చించేలా చేయడంద్వారా, తిరిగి తమ జేబుల్లోకే ఆసొమ్ము చేరేలా జగన్, విజయసాయిలు గొప్ప పథకం అమలుచేస్తున్నారని వెంకన్న దుయ్యబట్టారు.
నెల్లూరు జిల్లాలో బీసీలకు రావాల్సిన స్థానాలను వైసీపీ ప్రభుత్వం రాకుండా చేసిందన్నారు. జగన్ తన కులానికే ప్రాధాన్యత ఇస్తున్నాడని, అన్యకులస్థులు, మరీ ముఖ్యంగా బీసీలు పదవులు పొందడం జగన్ కు ఇష్టంలేదన్నారు. జగన్ కు, ఆయనపార్టీ అభ్యర్థులకు ఓటేస్తే, తమభవిష్యత్ తోపాటు, తమ పిల్లల భవిష్యత్ ను కూడా చేజేతులా నాశనం చేసుకున్నట్లేననే విషయాన్ని ప్రజలంతా తెలుసుకోవాలన్నారు. నిజాయితీగా, నిబద్ధతతో, స్వేచ్ఛగా ఎన్నికలు జరిపిస్తే, జగన్ ప్రభుత్వం ఎక్కడా గెలవదన్నారు. కడపజిల్లాలో టీడీపీ తరుపున ఎవరైనా పోటీచేస్తే, వారిని చంపేస్తామని బెదిరిస్తున్నారని, తప్పుడుకేసులు పెట్టి, వారిని జైళ్లకు పంపాలని ప్రభుత్వమే ఆదేశించిందన్నారు. ప్రజలను నమ్మే పరిస్థితిలో జగన్ లేడని, అందుకే పోలీసులను, అధికారులను అడ్డుపెట్టుకొని ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడన్నారు. తెలుగుదేశానికి ఓటేస్తే, పించన్లురావు, రేషన్ రాదు, ఇళ్లురావంటూ బెదిరించే పనులు వాలంటీర్లు మానుకోవాలని బుద్దా హితవుపలికారు. ప్రభుత్వం అండతో వాలంటీర్లు హద్దుమీరి ప్రవర్తిస్తే, వారికి ప్రజలే తగినవిధంగా దేహశుద్ధి చేస్తారని టీడీపీనేత హెచ్చరించారు.