కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో, ఎన్నికలు అయిన దగ్గర నుంచి, ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుంటూ, అంతర్గత గొడవలు బయట పెట్టి, పార్టీకి ఇబ్బంది కలిగిస్తున్న విషయం తెలిసిందే. మొదటిగా దేవినేని ఉమాని టార్గెట్ చేసుకుని ఒక వర్గం పావులు కదిపింది. కొన్ని రోజులు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ వీడి వెళ్లిపోతారని ప్రచారం జరిగింది. తరువాత విజయవాడ ఎంపీ కేశినేని నాని, బుద్దా వెంకన్న మధ్య జరిగిన ట్విట్టర్ వార్ గురించి అందరికీ తెలిసిందే. పర్సనల్ గా ఒకరి పై ఒకరు ట్వీట్లు పెట్టుకుని మరీ, దాదపుగా వారం రోజులు టార్గెట్ చేసుకున్నారు. చివరకు ఈ విషయం పై చంద్రబాబును కూడా లాగటంతో, తెలుగుదేశం శ్రేణులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఒకరి పై ఒకరు ఆధిపత్యం చూపిస్తూ, చంద్రబాబుని లాగటం పై, కార్యకర్తలు కూడా వారి పై ఆగ్రహం చెందారు.
తరువాత, కేశినేని నానిని చంద్రబాబు కలవటం, అలాగే బుద్దా వెంకన్నను కూడా పిలిచి మాట్లాడటంతో, వివాదం అయిపోయినట్టే కనిపించింది. అప్పటి నుంచి, రెండు వైపులా ట్వీట్స్ వెయ్యటం ఆపేశారు. కేవలం రాజకీయంగా వైసీపీని టార్గెట్ చేస్తూ, ఇద్దరూ ట్వీట్స్ కొనసాగిస్తున్నారు. ఈ వివాదాల మూలం ఏంటో, ఇప్పటికీ స్పష్టంగా బయటకు తెలియదు. అయితే ఈ వివాదం తరువాత, బుద్దా వెంకన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జిల్లా పార్టీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు పలువురు ముఖ్యనేతలు హాజరు కాలేదు. పార్లమెంట్ సమావేశాలు ఉండటంతో, కేశినేని నాని, ఈ సమావేశానికి రాలేదు.
అయితే ఈ సమావేశానికి హాజరైన బుద్దా వెంకన్న మాతరం కీలక నిర్ణయాన్ని ఆ సమావేశంలో ప్రకటించారు. ప్రస్తుతం విజయవాడ అర్బన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా బుద్దా వెంకన్న కొనసాగుతున్నారు. అయితే, వచ్చే టర్మ్ నుంచి ఈ పదవిలో తాను ఉండటం లేదని బుద్దా వెంకన్న తేల్చిచెప్పేశారు. అలాగే చంద్రబాబు భవిష్యత్‌లో ఎవరికి ఈ పదవి ఇచ్చినా, తాను అన్ని విధాలా సహకరిస్తానని బుద్దా వెంకన్న సమావేశంలో చెప్పి బయటకు వెళ్ళిపోయారు. అయితే అసందర్భంగా ఈ ప్రకటన ఎందుకు చేసారు అనే విషయం పై చర్చ జరుగుతుంది. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో బాధ్యత తీసుకోకుండా, బుద్దా తప్పించుకున్నారా అనే వాదన కూడా నడుస్తుంది. బుద్దా ఈ ప్రకటన చెయ్యటం వెనుక వ్యూహం ఏంటి ? రాజకీయ కోణం ఏంటి అనే దాని పై, తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది.