బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేను జీవీఎల్ ను హెచ్చరించడానికో, బెదిరించడానికో తాను ఈ వ్యాఖ్యలు చేయడంలేదని, రాజకీయ నాయకుల నోటికి హద్దు, పద్దు ఉండాలంటూ, జీవీఎల్‌కు దేహశుద్ధి తప్పదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హెచ్చరించారు. జీవీఎల్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. జీవీఎల్ పిచ్చోడని.. ప్రధాని మోదీ పిచ్చోడు చేతికి రాయి ఇచ్చారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడానికే జీవీఎల్‌కు ఎంపీ పదవి ఇచ్చారని వెంకన్న విమర్శించారు. మొన్నటి వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే పిచ్చోళ్లు ఉన్నారని అనుకున్నామని, ఇప్పుడు బీజేపీలో కూడా ఉన్నారని ఆయన అన్నారు.
జీవీఎల్‌ను బెదిరించడానికో లేక హెచ్చరించడానికో కాదని.. నోటీకి హద్దు.. పద్దు ఉండాలని, బీజేపీ, వైసీపీ పార్టీలకు రోజులు దగ్గరపడ్డాయని బుద్దా వెంకన్న అన్నారు. ఎన్నికల సంఘం ముసుగులో కేసుల మాఫీ కోసమే వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన అని బుద్దా వెంకన్న అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… ఓట్ల తొలగింపు అనేది ఎన్నికల సంఘం పరిధిలోని అంశమన్నారు. ఓట్లు తొలగించేది ఎవరన్నది జగన్ కు తెలియకపోవడం దారుణమన్నారు. జగన్ కు పక్క రాష్ట్రం నుంచి వేల కోట్లు ముడుపుతు అందుతున్నాయన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని జగన్ చూస్తున్నారన్నారు. ఎక్కడైనా 60 లక్షలు దొంగ ఓట్లు ఉంటాయా అంటూ ప్రశ్నించారు.
మరో పక్క, డ్వాక్రా మహిళలకు మూడు చెక్కులిచ్చేసి పండగ చేసుకోండని చంద్రబాబు అంటున్నారంటూ వైసీపీ నేత రోజా విమర్శించిన విషయం తెలిసిందే. ఈ విమర్శలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఘాటు కౌంటర్ ఇచ్చారు. రోజా ఎప్పుడైనా నిజం చెప్పారా? ఈ చెక్కులు తీసుకున్న వారెవరైనా చెల్లలేదని చెప్పారా? అని ప్రశ్నించారు. చెల్లని చెక్కులు ఇచ్చే అలవాటు రోజాకే ఉంది కనుక, ఈ చెక్కులు కూడా చెల్లనివని ఆమె అనుకుంటోందని సెటైర్లు విసిరారు. సినీ రంగంలో ఉన్నప్పుడు చెల్లని చెక్కులు ఇచ్చిన విషయం అందరికీ తెలుసని రోజాపై ఆరోపించారు.