వైఎస్‌ జగన్‌ కేబినెట్‌లో బెర్త్‌ ఆశించిన వైకాపా ఎమ్మెల్యేలు శనివారం రాజధాని అమరావతిలో జరిగిన మంత్రివర్గ ప్రమాణస్వీకారోత్స వానికి మొహం చాటేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీ యాంశంగా మారింది. ప్రధానంగా సీఎం వైఎస్‌ జగన్‌ సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులే అధికంగా ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి 30 మందికి పైగా శాసనసభ్యులు గైర్హాజరు అయినట్లు అంచనా ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి శాసనసభ్యులు గైర్హాజరు కావడంపై నిఘా వర్గాలు ముందుగా పసిగట్టలేకపోయాయనే వార్తలు వినవస్తున్నాయి. మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి గైర్హాజరు అయిన అసంతృప్త నేతలను వైకాపా అధిష్టానం బుజ్జగించే చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కేబినెట్‌లో బెర్త్‌ ఆశించి భంగపడ్డ నేతలతో మాట్లాడే కార్యక్రమం మొదలైనట్లు సమాచారం. జిల్లాల వారీగా అసంతృప్త నేతలతో చర్చించి వారి గైర్హాజరుకు గల కారణాలను తెలుసుకుంటున్నట్లు వినికిడి.

27 days

మంత్రి పదవులను ఆశించి భంగపడ్డ వారికి కేబినెట్‌ ర్యాంకు పదవులు కట్టబెట్టి సంతృప్తి పరచాలని నిర్ణయించినట్లు సమాచారం. కొందరు అసంతృప్తి నేతలను గుర్తించిన అధిష్టానం దిద్దుబాటు చర్యల్లో భాగంగా శ్రీకాంత్‌ రెడ్డి చీఫ్‌ విప్‌ పదవితో పాటు మరో నలుగురికి ప్రభుత్వ విప్‌ పదవులను కట్టబెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మిగిలిన వారికి కూడా కేబినెట్‌ హోదా గల పదవులు త్వరలోనే కట్టబెట్టనున్నట్లు సమాచారం. మొత్తం మీద మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి వైకాపా అసంతృప్త ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించింది. ఈ క్రమంలోనే మంత్రి పదవులు ఆశించి భంగపడిన భూమన కరుణాకరరెడ్డి, అనంత వెంక ట్రామిరెడ్డి, అంబటి రాంబాబు, సామినేని ఉదయ భాను, ఆర్‌కే రోజా, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, మర్రి రాజశేఖర్‌ వంటి సీనియర్లను నామినేటెడ్‌ పదవుల్లో కూర్చబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవులు ఆశించిన ఎమ్మెల్యేలంతా విజయవాడలో హోటళ్లు, అద్దె గృహాలలో అనుచరులతో మకాం వేశారు. సాయంత్రానికల్లా తమకు పిలుపు వస్తుందని ఎదురుచూశారు. అయితే వారి ఆశలను నిరాశలుగా మారుస్తూ పిలుపురాకపోవడంతో అసంతృప్తి చెందిన నేతలు కొందరు విజయవాడ నుంచి వెనుతిరగగా మరికొందరు విజయవాడలోనే ఉండి మంత్రివర్గ ప్రమాణస్వీకారోత్సవానికి మొహం చాటేసి తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

27 days

ప్రమాణస్వీకారానికి గైర్హాజరు అయిన వారిని వాకబు చేయగా కొందరు తమ వ్యక్తిగత కారణాల వలన హాజరు కాలేకపోయామని సమాధానమిచ్చారు. మరికొందరు అందుబాటులోకి రాకుండా ఫోన్‌లు స్విచ్‌ ఆఫ్‌ చేశారు. మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి అధికారపక్ష శాసనసభ్యులు డుమ్మా కొట్టడాన్ని నిఘా వర్గాలు పసిగట్టలేకపోయారనే వార్తలు వినవస్తున్నాయి. సమర్ధుడైన ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ స్టీఫెన్‌ రవీంద్రకు ఈ విషయం సవాలుగా మారింది. సాధారణంగా ఇలాంటి సమయంలో అధికార, ప్రతిపక్షాల శాసనసభ్యుల కదలికలపై నిఘా వర్గాల నిఘా ఉంటుంది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని పార్టీ, ప్రభుత్వ పెద్దలకు తెలియజేస్తుంటారు. నిఘా వర్గాల సమాచారాన్ని బట్టి పార్టీ, ప్రభుత్వ పెద్దలు అప్రమత్తులై సమస్యను చక్కదిద్దడం పరిపాటి. అయితే ఇక్కడ నిఘా వర్గాల సమాచార లోపంతో అసంతృప్తుల గైర్హాజరును ముందుగానే పసిగట్టలేకపోయారనే వార్తలు వినవస్తున్నాయి. పార్టీకి, ప్రభుత్వానికి ఈ సమాచారం ముందుగా తెలిస్తే అప్రమత్తులై రంగంలోకి దిగి సమస్యను చక్కదిద్దే అవకాశం ఉండేదని భావిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read