తెలుగుదేశం పార్టీలో మంత్రి వర్గ విస్తరణ అంటే, ఆశావాహులు చాలా ఎక్కువ మంది ఉంటారు. కాని చంద్రబాబు మాత్రం, అన్ని కోణాలు చూసుకుని మంత్రి పదవి ఇస్తూ ఉంటారు. ఇది కొంత మందికి నచ్చదు. గతంలో కూడా అలుగుడు పర్వం చూసాం. కాని నిన్న జరిగిన విస్తరణలో ఎవరినీ నొప్పించని విధంగా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు కార్యరంగం సిద్ధమైంది. మైనారిటీల నుంచి ఎన్‌ఎండీ ఫరూక్, గిరిజనుల నుంచి కిడారి శ్రావణ్‌ల ఎంపికకు ఆయా వర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులు మద్దతు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తమకు ఆమోదమేనని ప్రకటించారు.
మండలి ఛైర్మన్‌గా షరీఫ్, ప్రభుత్వ విప్‌గా చాంద్‌భాషాల నియామకానికి కూడా ఈ సందర్భంగా సీఎం పచ్చజెండా ఊపారు. తన నిర్ణయమే అంతిమమైనప్పటికీ ఏకాభిప్రాయంతో ప్రకటించాలని ముఖ్యమంత్రి భావించారు. అందుకే అందరితోనూ మాట్లాడాలంటూ ఈ రెండు వర్గాల శాసనసభ్యులు, పార్టీ నాయకులకు కబురు పంపారు. శనివారం ఉదయాన్నే ఉండవల్లికి పిలిపించి మాట్లాడారు. ఆ ఇద్దరినీ మంత్రివర్గంలోకి తీసుకోడానికి కారణాలను వివరించారు. దీంతో అప్పటిదాకా మంత్రి పదవులు ఆశించిన శాసనసభ్యులు చల్లబడి సీఎం నిర్ణయమే శిరోధార్యమని ప్రకటించారు. సీఎం వద్ద సమావేశానికి వెళ్లే సమయంలో ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్, చాంద్‌భాషా ఒకింత అసంతృప్తిగా ఉన్నారనే ఊహాగానాలు వచ్చాయి. ప్రసారమాధ్యమాలతో మాట్లాడినప్పుడు తమకూ అవకాశం ఇస్తారని ఆశిస్తున్నామని వారన్నారు. మధ్యాహ్నం 2.10 గంటలకు వేదిక వద్దకొచ్చిన చంద్రబాబు ముందుగా ఫరూక్, శ్రావణ్‌ను తన కార్యాలయంలోకి పిలిపించారు. మంత్రులుగా ఆదివారం ప్రమాణం చేయాల్సి ఉంటుందని చెప్పారు.
అనంతరం మైనారిటీల నేతలు 15మందితో ప్రజావేదిక లోపలి కార్యాలయంలో సమావేశమయ్యారు. వైకాపా నుంచి వచ్చినవారికి మంత్రి పదవులు ఇస్తే, గవర్నరు అభ్యంతరం చెబుతారనే సంకేతాలున్నాయని వెల్లడించారు. ఏళ్లుగా పార్టీలోనే పనిచేస్తున్న ఫరూక్‌కు అవకాశమిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆశావహులకు భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామన్నారు. సీఎం అభిప్రాయానికి నేతలంతా మద్దతు పలికారు. మండలి ఛైర్మన్ పదవి నుంచి ఫరూక్‌ను తప్పిస్తున్నందున షరీఫ్‌కు అవకాశమివ్వాలని కొందరు సూచించగా చంద్రబాబు అంగీకరించారు. తనకూ ప్రభుత్వ విప్‌గా అవకాశమివ్వాలని చాంద్‌భాషా కోరారు. అనంతపురంనుంచి ఇప్పటికే ముగ్గురు విప్‌లుగా ఉన్నారని గుర్తు చేసిన ముఖ్యమంత్రి చివరకు సుముఖత తెలిపారు. దీంతో ఉదయం కొంత అసంతృప్తిగా ఉన్నారన్న నేతల వైఖరిలో మార్పు కన్పించింది.